షాకిచ్చిన కొడాలి నాని.. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారట..
ఏపీలో ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని షాక్ ఇచ్చారు. ఏకంగా గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు విజయం సాధించిన కొడాలి నాని మున్ముంద రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. పార్టీ ఏదైనా కానీ గుడివాడలో విజయం మాత్రం ఆయనదే. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి గుడివాడను తన కంచుకోట చేసుకున్నారు. ఆయనకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
అలాంటి కొడాలి నాని రాజకీయ సన్యాసం స్వీకరిస్తారట. దీనికి కారణం.. ఓపిక, వయసు రెండూ లేకపోవడమేనంటున్నారు. నిజానికి రాజకీయాల్లో కాటికి కాళ్లు చాపుకున్న నేతలు సైతం రిజైన్ చేయాలని అనుకోరు. అలాంటిది కొడాలి నాని తనకు 2024 ఎన్నికలే ఫైనల్ అని ప్రకటించారు. 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తేల్చేశారు. ఈ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి వీరవిధేయుడిగా ఉన్న నాని ఇప్పుడు ఎందుకిలా ప్రకటించారనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
టీడీపీలో కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నాని.. ఆ తరువాత ఎమ్మెల్యే, మంత్రిగా కూడా పని చేశారు. ఆ తరువాత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి జగన్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటూ వస్తున్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా కూడా నాని పని చేశారు. అలాంటి నాని ఇప్పుడెందుకిలా మాట్లాడుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కొందరేమో.. ఎన్నికల్లో గెలిచేందుకు సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తున్నారని అంటుంటే.. మరికొందరు మాత్రం ఇది నిజమా? కాదా? అనే సందిగ్థంలో ఉన్నారు.