ప్రజాకర్షక పథకాల దిశగా.. ప్రగతి పథం దిశగా రేవంత్ అడుగులు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళుతున్నారు. ఒకవైపు ఆరు గ్యారెంటీల అమలు.. మరోవైపు డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజాకర్షక పథకాల దిశగా.. ప్రగతి పథం దిశగా ప్రయాణం సాగిస్తున్నారు. అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల అభ్యున్నతే నిజమైన దేశాభివృద్ధి అంటూ అంబేద్కర్ సూక్తులను వల్లెవేస్తు్నారు. నిన్నటికి నిన్న తెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీల సదస్సు జరిగింది. ప్రభుత్వ హామీలు, నిర్ణయాలు అమలు కావాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకుల్లాగా పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రోజుకు 18 గంటల పాటు పని చేసేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధమవ్వాలంటూ అధికారులకు రేవంత్ సూచనలు చేశారు. డ్రగ్స్, గంజాయి అనే పదాలు రాష్ట్రంలో వినిపించకూడదని హుకుం జారీ చేశారు. నకిలీ విత్తనాల కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఈ దఫా రైతులకు నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్, గంజాయి, మాదకద్రవ్యాలు వాడేవారితో ఫ్రెండ్లీగా ఉండటం కాదని పౌరులతో స్నేహంగా మెలగాలని రేవంత్ సూచించారు.
గంజాయి వినియోగంతో పంజాబ్ కుప్పకూలిందని ఈ దుస్థితి తెలంగాణకు రాకూడదన్నారు. సన్ బర్న్ పార్టీలకు అనుమతుల్లేవని.. అయినా సరే ఏర్పాటు చేస్తే నిర్వాహకుల అంతు చూస్తానని రేవంత్ హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి తెలంగాణలోకి దిగుమతిపై తనిఖీలు చేయాలన్నారు.సైబర్ నేరాలపై పోలీసు అధికారులంతా దృష్టి పెట్టి వాటికి పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రామ సభలకు 119 నియోజకవర్గాలకు 119 మంది ప్రత్యేక అధికారులు హాజరు కావాల్సిందేననని ఆదేశాలు జారీ చేశారు.