బీజేపీతో బీఆర్ఎస్ కలిసి నడుస్తుందా?

బీజేపీతో బీఆర్ఎస్ కలిసి నడుస్తుందా?

త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగానే ఓటేస్తున్నాయి. మోదీ హ్యాట్రిక్ పీఎం కాబోతున్నారనేది సత్యమని సర్వేలు అంటున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే తెలంగాణలో ఓటమి పాలైంది. ఇంట గెలవలేనిది.. రచ్చ గెలవడం కష్టం కాబట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వ్యూహం మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులంటూ ఎవరూ ఉండరు.

నిన్నటి వరకూ బద్ద శత్రువులా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ఇక ముందు మిత్రుల్లా కలిసి నడవనున్నారని టాక్. కాంగ్రెస్ పార్టీ సీఎంగా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అప్పగించడంతో బీఆర్ఎస్‌కు ఇబ్బందికర వాతావరణం తెలంగాణలో తలెత్తింది. నెలరోజుల్లోనే రేవంత్ చాలా మార్పులు తీసుకొచ్చారు. పైగా ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. లక్షల కోట్ల అవినీతి జరిగిందని నిరూపించే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వ్యూహాన్ని మార్చుకోనుందని తెలుస్తోంది. బీజేపీతో కలిస్తే తమకు కాస్త ఊతమొస్తుందని భావిస్తున్నారట.

Advertisement

కేసీఆర్ ఎంపీ పదవికి పోటీ చేస్తారని ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది. బీజేపీతో అంటకాగితే మరోమారు కేంద్ర మంత్రి అయ్యే అవకాశమూ లేకపోలేదు. అదే జరిగితే తెలంగాణను గుప్పిట్లో పెట్టుకునేందుకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారట. కేంద్రంలో కాంగ్రెస్‌కు ఈసారి కూడా ఎలాగూ అధికారం రాదు కాబట్టి తమకు కలిసొస్తుందని అనుకుంటున్నారట. ఎలాగూ ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత విషయంలో బీజేపీతో ఓ ఒప్పందమైతే చేసుకున్నారని టాక్. ఈసారి మొత్తానికే కలిస్తే.. అసలే ఇబ్బంది రాదని భావిస్తున్నారట.