రేవంత్ డోర్లు తెరిచారు.. వారంతా వెళతారా?

రేవంత్ డోర్లు తెరిచారు.. వారంతా వెళతారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క విషయంపైనా స్పందించే తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. కుమారి ఫుడ్ స్టాల్ తొలగింపు విషయంలోనూ ఆయన స్పందించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజాగా తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేతల విషయంలోనూ ఆయన స్పందన అనూహ్యం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ దక్కలేదని చాలా మంది నేతలు బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. పోనీ అక్కడేమైనా వారికి టికెట్ దక్కిందా? అంటే అదీ లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీపై కోపంతో వెళ్లిపోయారు.

చాలా కాలం పాటు పార్టీకి వెన్నుదన్నుగా ఉండి తీరా అధికారంలోకి వచ్చే సమయంలో అలకలతో దూరమయ్యారు. నిజానికి బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్‌లోకి జంప్ అవుతుంటే కాంగ్రెస్ నుంచి వెళ్లిన నేతలు మాత్రం తిరిగి రాలేక.. రావాలంటే మొహం చెల్లక అలా ఉండిపోయారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. వారు తిరిగి వస్తే.. ఎలాంటి షరతులు లేకుండా పార్టీలోకి తీసుకోవాలని తాజాగా జరిగిన సమావేశంలో రేవంత్ నిర్ణయించారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించింది. 

Advertisement

అధిష్టానం మీద కోపంతో కాంగ్రెస్ నేతలంతా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఎన్నికల వేడి ఒకవైపు.. కాంగ్రెస్ హవా నడుస్తుండటం మరోవైపు.. మొత్తానికి వచ్చిన వాళ్లను వచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ లాగేసింది. కేవలం కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాలని మాత్రమే బీఆర్ఎస్ ఆయా నేతలందరినీ పార్టీలోకి తీసుకుంది తప్ప వారికి ఎలాంటి పదవులూ ఇవ్వలేదు. పోనీ బీఆర్ఎస్ గెలిచిందా? అంటే అదీ లేదు. దీంతో కాంగ్రెస్‌ను వీడిన వారంతా పార్టీలో ఉండలేక.. వీడలేక సతమతమవుతున్నారు. వీరందరి కోసం సీఎం రేవంత్ గేట్లు ఓపెన్ చేశారు.