రాప్తాడు సభలో చంద్రబాబును ఏకిపారేసిన జగన్

రాప్తాడు సభలో చంద్రబాబును ఏకిపారేసిన జగన్..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు రాప్తాడులో సిద్ధం-3 సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జనసముద్రంలా కనిపిస్తోందని పేర్కొన్నారు. మన యుద్ధమంతా పెత్తందారులతోనేనని.. ముఖ్యంగా ఈ ఏడాది విశ్వసనీయత, వంచన అనే రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. పెత్తందారులతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? అని ప్రజానీకాన్ని జగన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.

10 శాతమైనా అమలు చేశారా?

‘‘పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం గుర్తుకొస్తుందా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా?’’ అని జగన్ ప్రశ్నించారు.

రాప్తాడు సభలో చంద్రబాబును ఏకిపారేసిన జగన్..

చంద్రబాబు చేసేవన్నీ మోసాలే..

రాప్తాడు సభ వేదికగా చంద్రబాబును జగన్ ఏకిపారేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి అబద్దాలు, మోసాలతో వస్తున్నారన్నారు. రంగురంగుల మేనిఫెస్టోలతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడన్నారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలేనని.. చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అనేది చంద్రబాబు సిద్ధాంతమన్నారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికి కూడా న్యాయం చేయలేదన్నారు. చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలంటూ జగన్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారని.. అప్పట్లో అందరూ చొక్కాలు మడతపెట్టి.. చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారని జగన్ అన్నారు. మరోసారి ఆయన్ను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

కుప్పం టు ఇచ్చాపురం బాబు మార్క్ ఎక్కడ?

‘చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా? కుప్పం టు ఇచ్చాపురం బాబు మార్క్ ఎక్కడైనా ఉందా?’ అని జగన్ ప్రశ్నించారు. 57 నెలల పాటు చిత్తశుద్ధితో పాలన అందించామన్నారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని.. తమ హయాంలో జరిగిన మంచిని ప్రజలకు వివరించాలన్నారు. చేసిన మంచిని చెప్పాలని.. పథకాల కొనసాగింపు ఎంత అవసరమో వివరించాలన్నారు. ప్రతి అవ్వా, తాత ముఖంలో చిరునవ్వులు చూశామని.. ప్రతి అక్క, చెల్లెమ్మకు ఎంతో మేలు చేశామన్నారు. వైసీపీ పేరు చెబితేనే అక్కచెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయన్నారు. రైతు భరోసా.. రైతన్నకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారని జగన్ పేర్కొన్నారు.

Ys Jagan Siddham

టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి..

31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనదని.. అలాగే ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు మోసాన్ని ప్రతి రైతన్నకు వివరించాలన్నారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలన్నారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలని.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలని.. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చామని జగన్ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చామన్నారు. కేవలం కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు రాకూడదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలన్నారు. పెన్షన్‌దారులంతా మనకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయడమంటే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమేనని జగన్ అన్నారు.

సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు?

వైసీపీ మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోందని జగన్ తెలిపారు. ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇవన్నీ చేశామని.. మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పనులు చేస్తామన్నారు. పేదల ఖాతాల్లోకి లంచాలకు తావు లేకుండా నగదు బదిలి జరుగుతోందన్నారు. 57 నెలల్లోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామన్నారు. చంద్రబాబుకు ఓటు వేయడమంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయడమేనని జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశామని.. 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకని జగన్ ప్రశ్నించారు. 

Google News