భారీ స్కెచ్‌తో తెలంగాణ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్..

భారీ స్కెచ్‌తో తెలంగాణ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్..

కర్ణాటక ఎన్నికల్లో మంచి సక్సెస్ సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న మరో రాష్ట్రం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక ఎన్నికల శంఖారావానికి తెలంగాణ విలీన దినోత్సవమైన సెప్టెంబరు 17న ముహూర్తం ఫిక్స్ చేసింది. 

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తదితరులతో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. గతంలో పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ రైతు, యువత, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే సెప్టెంబర్ 17న తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను సోనియా గాంధీ ప్రకటించనున్నారు. 

Advertisement

ఈ క్రమంలోనే సోనియా బీఆర్ఎస్‌ను సైతం టార్గెట్ చేయనున్నారని సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంపై చార్జిషీట్‌ను విడుదల చేసి తద్వారా క్షేత్రస్థాయి ప్రచారానికి టీ కాంగ్రెస్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. కాగా.. 17 రాత్రికి పార్టీకి చెందిన కీలక నేతలంతా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి.. 18 నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈ క్రమంలోనే నియోజకవర్గాలకు వెళ్లిన నేతలంతా సోనియా ప్రకటించిన హామీలు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విడుదల చేసిన చార్జిషీటునూ ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.