కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు సీజ్.. అంతలోనే..

కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు సీజ్.. అంతలోనే..

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించిన మరుసటి రోజే బీజేపీ గేమ్ స్టార్ట్ చేసింది. కాసేపట్లో పెద్ద హైడ్రామానే నడిపింది. సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ తరుణంలో పార్టీలన్నీ వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన అనుబంధ సంఘాల అకౌంట్లను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది.

మొత్తం పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన 9 అకౌంట్లనూ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం సీజ్ చేసింది. దీనికి కారణాన్ని సైతం వెల్లడించింది. 2018-19 లో ఆదాయ పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి జరిమానా విధించడంతో పాటు నోటీసులను సైతం జారీ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాలు ఇప్పటి వరకూ జరిమానా చెల్లించకపోగా.. నోటీసులకు స్పందించలేదు. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ఆదాయ పన్నుశాఖ ఇవాళ సడెన్‌గా సీజ్ చేసి పడేసింది. ఆ వెంటనే ట్విస్ట్ కూడా ఇచ్చింది.

Advertisement

కాంగ్రెస్ పార్టీకి ఊరటనిస్తూ ఐటీ అప్పిలియేట్ ట్రిబ్యునల్ ఓ ప్రకటన జారీ చేసింది. ఇన్ కం ట్యాక్స్ సీజ్ చేసిన అకౌంట్లను ఉపయోగించుకునేందుకు ఐటి అప్పిలియేట్ ట్రిబ్యునల్ అనుమతించింది.  అసలు సీజ్ చేయడమెందుకు? ఆ వెంటనే గంటలోనే అకౌంట్లను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వడం ఎందుకు? చివరకు క్రౌడ్ ఫండింగ్ చేసిన డబ్బుతో సహా ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. దీనిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నారు.