సీమాంధ్రలో పాతాళంలో ఉన్న పార్టీ… ఉనికి కోసం ఆరాటం

సీమాంధ్రలో పాతాళంలో ఉన్న పార్టీ... ఉనికి కోసం ఆరాటం

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తరువాతే ఏ పార్టీ అయినా.. జాతీయ పార్టీగా ఓ వెలుగు వెలిగింది. ఈ పార్టీ వైభోగం అప్పట్లో అంతా ఇంతా కాదు. 90 శాతం రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. దేశంలోనే అధిక సంఖ్యలో ముఖ్యమంత్రులు.. గవర్నర్లు.. అబ్బో మాటలకందని స్థాయిలో హవా నడిపిస్తూ ఉండేది. అప్పట్లో గల్లీ టు ఢిల్లీ వరకూ క్యాడెర్ మెడలో ఓ ఆభరణంలా కాంగ్రెస్ జెండా ఉండేది. ఇప్పుడు ఆ కాంతులూ లేవు. కళ అంతకన్నా లేదు. పూర్తిగా అమావాస్య చంద్రుడి మాదిరిగా అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి. ఏదో అరకొర రాష్ట్రాల్లో అధికారంలో ఉందంతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం విడగొట్టిన కాంగ్రెసును సీమాంధ్ర ప్రజలు పాతాళానికి తొక్కేశారు. గత పదేళ్లలో ఈ పార్టీ అసలు ఏపీలో ఉనికిలోనే లేదు.

పాతాళానికి తొక్కేశారు..

అసలు ఇక ముందైనా కోలుకుంటుందో లేదో అనే పరిస్థితి ఏపీలో నెలకొంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎగిరిపడిన నేతలంతా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీనికి తోడు దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత అయన కుటుంబాన్ని, ముఖ్యంగా కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కర్కశ వైఖరిని ప్రజలు సహించలేకపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కేశారు.  2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏపీలో సోదిలో కూడా లేకుండా పోయింది. అసలు ఈ పార్టీకున్న కేడర్ అంతా ఎవరి దారి వారు చూసుకున్నారు. మొత్తానికి పదేళ్లపాటు కేంద్ర మంత్రులుగా ఓ వెలుగు వెలిగిన నేతలు సైతం డిపాజిట్లు సాధించలేకపోయారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. నోటా కంటే కూడా తక్కువ ఓట్లను కాంగ్రెస్ నేతలు తెచ్చుకున్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతోంది.

ఉనికిని చాటుకోవాలని ఆరాటం..

కేంద్ర మంత్రిగా పని చేసిన పల్లం రాజు కాకినాడలో పోటీ చేస్తే 8,640 ఓట్లు.. మరో కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే 9585 ఓట్లు వచ్చాయి . ఇంకో సీనియర్ నేత సాకే శైలజానాథ్ సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1384 ఓట్లు వచ్చాయి.. ఇక్కడ నోటాకు 2340 ఓట్లు రావడం గమనార్హం. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పొతే ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌కు కనీస మర్యాద దక్కలేదు. దీంతో ఈసారైనా ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాట పడుతోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్లు వచ్చినా కూడా ఆంధ్రాలో కాంగ్రెస్‌కి అస్తిత్వం లేదు. అలాంటిది ఇక ముందు ఉంటుందన్న నమ్మకమూ లేదు. ఇప్పుడు ఇంకెంత గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆంధ్రాలో నూకలు దొరకవు అనేది ఇక్కడి స్కూలు పిల్లాడిని అడిగినా స్పష్టంగా చెబుతాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత చర్చ అవసరం లేదు.

Google News