విజయవాడ టికెట్ నాది కాదు.. కేశినేని నాని సంచలనం..

విజయవాడ టికెట్ నాది కాదు.. కేశినేని నాని సంచలనం..

కేశినేని నానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే నేతకూ ఉండదంటే అతిశయోక్తి కాదు. పార్టీతో సంబంధం లేకుండా నిలబడినా గెలవగల సత్తా ఆయనది. అన్ని పార్టీల నేతలనూ చక్కగా కలుపుకుని వెళుతుంటారు. అందుకే విజయవాడ పార్లమెంటు ఎప్పుడూ ఆయనదే అవుతుంటుంది. అలాంటి ఆయనకు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వబోమని తేల్చేసిందట. ఈ విషయాన్ని ఎవరో కాదు.. స్వయంగా నానియే చెప్పారు.

కేశినేని తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ప్రకటన చేశారు. ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖలో నాని ఏం చెప్పారంటే..విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని పేర్కొన్నారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతల ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి చెప్పారని తెలిపారు.

తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని కూడా నాని చెప్పడం సంచలనంగా మారింది. అసలు తనను జోక్యమే చేసుకోవద్దన్నారట. అధినేత ఆదేశాలను తప్పక పాటిస్తానని నాని పేర్కొన్నారు. తిరువూరు సభ విషయంలో  బుధవారం నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గాలు మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలోనే తిరువూరు ఇన్‌చార్జి దేవదత్‌ను పూజకు పనికి రాని పువ్వంటూ నాని దూషించారు. ఇది కాస్తా దళిత నేతల్లో ఆగ్రహం తెప్పించింది. నిన్న సాయంత్రం జిల్లా పార్టీ నేతల భేటీలో అందరినీ కలుపుకుని వెళ్లాలని నానికి చంద్రబాబు సూచించారు.