పార్టీకి, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నా: కేశినేని నాని సంచలనం

పార్టీకి, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నా: కేశినేని నాని సంచలనం

విజయవాడ ఎంపీ కేశినేని నాని నేటి తెల్లవారుజామున సంచలన ప్రకటన చేశారు. నిన్న తనకు విజయవాడ టికెట్ ఇవ్వబోమని చంద్రబాబు చెప్పారంటూ బాంబు పేల్చిన కేశినేని నాని తిరిగి నేడొక బాంబు పేల్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి తాను అవసరం లేదని భావించిన తర్వాత ఇక తాను పార్టీలో కొనసాగడం సరికాదని ఆయన ఎక్స్ వేదికగా తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే తన లోక్‌సభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు.

‘‘చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తా’’ అని కేశినేని నాని ఎక్స్ వేదికగా తెలిపారు. నిన్నటి నుంచి నాని సంచలనాలకు తెరదీస్తూనే ఉన్నారు. తనకు విజయవాడ టికెట్ ఇవ్వబోనని చంద్రబాబు తేల్చి చెప్పారంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

Advertisement

గురువారం సాయంత్రం ఈ విషయాన్ని తనకు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి చెప్పారని నాని తెలిపారు. తిరువూరులో చంద్రబాబు సభ బాధ్యతల నుంచి కూడా తనను తప్పించారని తెలిపారు. ఆ బాధ్యతలను వేరొకరికి అప్పగించినట్టు వెల్లడించారు. వీటన్నింటి కారణంగా మనస్తాపం చెందిన కేశినేని నాని పార్టీతో పాటు తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్టు నేటి తెల్లవారుజామున 4:40కి ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.