Kesineni Nani: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్.. పొమ్మనలేక.. పొగబెట్టారా?

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్.. పొమ్మనలేక.. పొగబెట్టారా?

బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి చెక్ పెట్టేశారా? పొమ్మనలేక.. పొగబెట్టారా? ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఆయనకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తన లోక్‌సభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. అసలేం జరిగింది? పార్టీ ఆయనకు ఎందుకు ఇలా చెక్ పెట్టింది? నిజానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబులోని అసలు మనిషి బయటకు వచ్చాడు. ఎవరైనా సరే.. తన తరుఫున ఢిల్లీలో లాబీయింగ్ చేయడమో.. లేదంటే చెంచాగిరి చేయడమో చేయాలి. లేదంటే ఆయన ఉపేక్షించరనేది మరోమారు రుజువైంది.

పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ హుకుం..

కేశినేని నాని చేసిన తప్పల్లా చంద్రబాబు తరుఫున ఢిల్లీ పెద్దలతో రాయబారాలు నడపకపోవడం.. చీకటి వ్యవహారాలు చక్కబెట్టకపోవడమేనని తెలుస్తోంది. అందుకే రెండు సార్లు విజయవాడలో పార్టీని గెలిపించారనేది కూడా లేకుండా ఆయనను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ చంద్రబాబు హుకుం జారీ చేశారు. పార్టీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరించాలంటూ తన రాయబారుల ద్వారా ఆదేశాలు పంపారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో టీడీపీ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి నానిని బదులు ఆయన తమ్ముడు చిన్నిని ఇన్‌చార్జిగా నియమించారు.అయితే ఈ సభపై చర్చించేందుకు గానూ.. చిన్ని, నాని వర్గీయులు బుధవారం తిరువూరు నియోజకవర్గ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

దేవదాస్ మీద దాడికి యత్నం..

ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దేవదత్‌ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫోటో లేదన్న విషయాన్ని ఆయన వర్గీయులు గుర్తించి తమను అవమానించేందుకే ఇలా చేశారంటూ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన కాస్తా ఘర్షణగా మారింది. దేవదాస్ మీద దాడికి యత్నించగా స్థానిక నేతలు అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడికి కేశినేని చిన్ని కూడా వచ్చారు. ఘర్షణ కాస్తా ఇరువర్గాలూ కుర్చీలు విసురుకుని దాడి చేసుకునే వరకూ వెళ్లింది. కాసేపటికే అధిష్టానం కేశినేని నానికి చెక్ పెట్టింది.ఆ వెంటనే తిరువూరు సభ కోసం మరో ఇన్‌చార్జిని నియమించి.. కేశినేని నాని ఈ సభ విషయంలో జోక్యం చేసుకోవద్దని సూచించింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానాన్ని నానికి ఇవ్వడం లేదంటూ చావు కబురు చల్లగా చెప్పింది. నాని కాస్త ఖంగుతిన్నా వెంటనే గట్టిగానే రియాక్ట్ అయ్యారు.

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్.. పొమ్మనలేక.. పొగబెట్టారా?

లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా..

ఇండిపెండెంట్‌గా కూడా గెలవగల సత్తా ఉన్న వ్యక్తినని తాను ఎవ్వరికీ గులాంగిరీ చేయబోనని కేశినేని నాని స్పష్టం చేశారు. కేశినేని నానిని టీడీపీకి, చంద్రబాబుకు భక్తులుగా ఉన్న బోండా ఉమ వంటి వారు కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తనను పార్టీ పనుల్లో జోక్యం చేసుకోవద్దన్న విషయాన్ని నాని ఫేస‌బుక్ వేదికగా వెల్లడించారు. అంతేకాదు.. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని.. అలా తెలుసుంటే ఎప్పుడో మంచి పొజిషన్‌లో ఉండేవాడినని కేశినేని నాని తేల్చి చెప్పారు. త్వరలోనే పార్టీకి, తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని.. తన అనుచరులతో చర్చించిన మీదట భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని కేశినేని నాని తెలిపారు.

Google News