పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యే.. కారు ఖాళీ..!
తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకూ బీఆర్ఎస్ మినహా వేరే పార్టీలకు తెలంగాణలో ఛాన్సే లేకుండా పోయింది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ సీన్‌లోనే లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికలతోనే బీఆర్ఎస్ పతనం ఆరంభమైంది. ఇక లోక్‌సభ ఫలితాల విషయానికి వస్తే కొన్ని సర్వేలు బీఆర్ఎస్‌కు ఒకటి కట్టబెట్టగా.. కొన్ని సర్వేలైతే జీరోలు కట్టబెట్టాయి. ఇప్పుడు వార్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యే నడుస్తోంది. దక్షిణాదిలో అసలు బీజేపీకి స్థానమే లేదనుకుంటే లోక్‌సభ ఫలితాల్లో ఆ పార్టీకి సర్వేలన్నీ అగ్ర తాంబూలం ఇచ్చాయి.
అవకాశమే లేని బీజేపీ టాప్‌లో..
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీల వైపే మొగ్గు చూపారు. అసెంబ్లీ ఫలితాల్లోనూ బీజేపీ గతంతో పోలిస్తే మంచి హవానే చాటింది. పరిస్థితి ఇంతే కొనసాగితే మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని తప్పిదాలే బీజేపీకి వరంలా మారుతున్నాయి. అసలు ఏమాత్రం అవకాశమే లేని బీజేపీ లోక్‌సభ ఫలితాల్లో ముందుండటం ఆశ్చర్యకరం. అధికారంలోకి వచ్చాక రేవంత్ చేసిన కొన్ని పనులు అద్భుతంగా అనిపించాయి. ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చడం.. బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం వంటివి ప్రభుత్వానికి బాగా పేరు తెచ్చిపెట్టాయి.
అది వేసేదెన్నడో.. మనం చూసేదెన్నడో..
అదే పేరును నిలబెట్టుకుంటే బాగుండేది. రాష్ట్రంలో గత పదేళ్లలో ఎన్నడూ చూడని పవర్ కట్స్‌ను ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం చూస్తోంది. గతంలో ఎదుర్కోని నీటి సమస్యను ఎదుర్కొంటోంది. రూ.500కే సిలిండర్ అని.. రూ.900 కట్టించుకుని రూ.400 సబ్సిడి అంటోంది. అది వేసేదెన్నడో.. మేము చూసేదెన్నడో అని జనాలు అంటున్నారు. అసలు జనాలకు కావల్సిన నిత్యావసరాల విషయంలోనే రేవంత్ ప్రభుత్వం ఇలా చేస్తే ఎలా? తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే కొంత మేర అసహనం వచ్చేసింది. అందుకే బీజేపీకి అగ్రస్థానంలో పెట్టారు. సర్వేలు నిజమై బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే మాత్రం అది కాంగ్రెస్ పార్టీ స్వయంకృతమేనని చెప్పాలి.