ఏపీలో ఎన్నికలపై ఎన్నికల కమిషన్ నీళ్లు

ఏపీలో ఎన్నికలపై ఎన్నికల కమిషన్ నీళ్లు

ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ నీళ్లు చల్లింది. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు లేనట్లేనని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ మేరకు ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగుస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలను జారీ చేసింది.

ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాలకు 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిస్సాలకి ఎన్నికలను ఈసీ నిర్వహించనుంది. అయితే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిస్సాలకి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేసిన అధికారులను వెంటనే బదిలీచేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సొంత జిల్లాల అధికారులను కూడా వేరే జిల్లాలకు బదిలీ చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

పోలీసు అధికారులతో సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని సీఈసీ పేర్కొంది. అయితే జూన్ 16 వరకూ గడువు ఉందని ఎన్నికల కమిషన్ స్వయంగా వెల్లడించడంతో ముందస్తు లేనట్టేనని తెలుస్తోంది. అయితే ఏపీలో పార్టీలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఇప్పటికే తమ కేడర్‌ను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో వైసీపీ అయితే మార్పులు, చేర్పులు చేస్తోంది. ప్రజాబలం లేని ఎమ్మెల్యేలను తప్పిస్తోంది. మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తోంది.