మీరు బానిసత్వాన్నే కోరుకుంటున్నారా ?: పవన్‌పై విరుచుకుపడుతున్న జోగయ్య

మీరు బానిసత్వాన్నే కోరుకుంటున్నారా ?: పవన్‌పై విరుచుకుపడుతున్న జోగయ్య

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాపులకు అండగా ఉంటాడనుకున్న పవన్.. వారి ఆత్మగౌరవాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాళ్ల వద్ద పెట్టడాన్ని సహించలేకపోతున్నారు. ఈక్రమంలోనే పవన్‌పై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు అయిన ఈ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన చెవిలో జోరీగలా మారారు.

పవన్‌పై విరుచుకుపడుతున్న పెద్దాయన..

Advertisement

పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని.. ప్రతిష్టను.. కాపుల్లో ఉన్న విలువ గౌరవాన్ని తగ్గించడమే పనిగా పెట్టుకుని మరీ పెద్దాయన పవన్‌పై విరుచుకుపడుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. పవన్ సమాధానం చెప్పలేని విధంగా హరిరామ జోగయ్య ప్రశ్నలు సంధిస్తున్నారు. కాపులకు ప్రాధాన్యం దక్కాలనేది మొదటి నుంచి హరిరామ జోగయ్య ఆరాటం. ఈ క్రమంలోనే కనీసం తమ సామాజిక వర్గానికి 60 సీట్లు అయినా కేటాయించాలని జనసేనను లేఖ ద్వారా డిమాండ్ చేశారు. అసలు పొత్తులో భాగంగా తమకు ఎన్ని సీట్లు వస్తాయో తెలియని పవన్‌కు హరిరామ జోగయ్య లేఖ తలనొప్పిగా మారింది.

చంద్రబాబు వెంట ఎందుకు నడుస్తున్నావు?

ఓ పాతిక సీట్లు చంద్రబాబు ఇస్తాడేమో అని జనసైనికులు భావిస్తున్న తరుణంలో.. తమకు ప్రాధాన్యమివ్వాలని హరిరామ జోగయ్య లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువ. హరిరామ జోగయ్య ప్రకారం దాదాపు 50 నియోజకవర్గాల్లో కాపులు బలంగా ఉన్నారట. అన్ని చోట్ల కాపులు బలంగా ఉన్నప్పుడు వారికి ప్రాధాన్యాన్ని చంద్రబాబు ఇవ్వనప్పుడు ఆయన వెంట ఎందుకు నడుస్తున్నావనేది హరి రామజోగయ్య ప్రశ్న. ఆయనకు ఎందుకు ఊడిగం చేయాలని ప్రశ్నిస్తూ జోగయ్య లేఖ రాశారు. నిజానికి దీనికి పవన్ ఏం సమాధానం చెప్పగలరు? వీటికే సమాధానం లేదంటే తాజగా హరిరామ జోగయ్య మరో బాణం సంధించారు.

మీరు బానిసత్వాన్నే కోరుకుంటున్నారా ?

పవన్‌ను ఎక్కడికో తీసుకుపోదామని అనుకుంటున్నామని.. కానీ మీరు అక్కడికి రారని.. ఇక్కడే ఉంటాను అంటారంటూ ఈ పెద్దాయన కుర్ర హీరో మాదిరిగా డైలాగ్ చెప్పారు. ఇలా ఐతే ఎలా అని నిలదీశారు. అసలు ఆ కూటమికి చంద్రబాబే నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అని తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించిన విషయాన్ని హరిరామ జోగయ్య ప్రస్తావించారు. అలా అయన ప్రకటించాక కూడా మీరు చంద్రబాబు వెంట వెళ్తారా ? అని ప్రశ్నించారు. ‘‘మీరు చంద్రబాబుకు తాబేదారుగా ఉంటారా ? మీరు బానిసత్వాన్నే కోరుకుంటున్నారా ? మీకు అస్తిత్వం లేదా ? కాపుల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత లేదా?’’ అంటూ జోగయ్య వేసిన ప్రశ్నలకు పవన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.