కేసీఆర్ చేసిన పనితో మూకుమ్మడి రాజీనామాలు..!

కేసీఆర్ చేసిన పనితో మూకుమ్మడి రాజీనామాలు..!

సింగరేణి ఎన్నికల నుంచి బీఆర్ఎస్ తప్పుకుంది. తాజాగా గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. సింగరేణి ఎన్నికలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. తాజాగా కేంద్ర లేబర్ కమిషనర్ ఎన్నికల తేదీని ప్రకటించేశారు. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ, గుర్తుల కేటాయింపు సైతం పూర్తైంది. దీంతో సింగరేణి ఎన్నికల్లో  పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అనుబంధ టీబీజీకేఎస్ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

పార్టీ నిర్ణయంపై టీబీజీకేఎస్ నేతలు మండిపడుతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలనడమేంటని ఫైర్ అవుతున్నారు. అంతేకాదు.. కార్మిక నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారంతా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎన్నికలతో కాంగ్రెస్ బలం మరింత పెరిగినట్టైంది. ఇవాళ అసంతృప్త కార్మిక సంఘాల నేతలంతా హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఉద్యమం నుంచి పుట్టిన సంఘాన్ని పోటీ చేయొద్దని ఆదేశించడమేంటని కార్మిక సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు. సింగ రేణి గుర్తింపు ఎన్నికల గడువు ముగిసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ యాజమాన్యం ఎన్నికలు నిర్వహించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ అండ చూసుకుని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తోంది. కార్మిక సంఘాలు ఎన్నికల కోసం పట్టుబడుతున్నప్పటికీ పట్టించుకోలేదు. ఇక చేసేదేమీ లేక ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పులో ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.