Telangana Elections: ఈ ఏడాదే తెలంగాణ ఎన్నికలు.. కసరత్తు ప్రారంభించిన ఎలక్షన్ కమిషన్
తెలంగాణ(Telangana)లో 2023లోనే ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు తెలంగాణకు చేరుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు. ఈ క్రమంలోనే అధికారులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. నేడు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌తో భేటీ కానున్నారు. రేపు కలెక్టర్లు, ఎస్పీలతో, 24న చీఫ్ సెక్రటరీతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సమీక్షానంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయానికి రానున్నారు. తెలంగాణలో 2023లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ(Elections Commission) కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ సాధారణ ఎన్నికల నిర్వహణకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే ఎలక్షన్ కమిషన్ సైతం సన్నద్దమవుతోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ కూడా ఇచ్చింది. ఓటర్ల నమోదు మొదలు కొని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకూ ఎన్నికల ప్రాసెస్‌పై శిక్షణ ఇవ్వడం జరిగింది.
అంతేకాకుండా బదిలీల ప్రక్రియకు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పని చేస్తున్న అధికారుల బదిలీలను బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఈ బదిలీల ప్రక్రియ మొత్తం జూలై 31 నాటికి పూర్తి కానుంది. మరోవైపు తెలంగాణ(Telangana)లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కూడా కొనసాగుతోంది.