నన్ను తిట్టాల్సిన అవసరమేంటి? నేనేమీ మీ వద్ద నౌకరీ చెయ్యట్లేదే?: పవన్‌కు ముద్రగడ లేఖ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ మరో లేఖ రాశారు. అభిమానులతో బండబూతులతో మెసేజ్‌లు పెట్టిస్తున్నారని.. వాటికి భయపడేది లేదన్నారు. పవన్ కేవలం సినిమాల్లోనే హీరో అని.. రాజకీయాల్లో కాదని గ్రహించాలన్నారు. తనను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తానేమీ పవన్ వద్ద నౌకరీ చేయడం లేదని.. అసలు పవన్‌కు తనకు సంబంధం ఏంటన్నారు. తానొక అనాథను.. ఒంటరి వాడిని కాబట్టి ఏమన్నా పడతాననే గర్వమా? అని ప్రశ్నించారు. వంగవీటి రంగా హత్య తర్వాత ఎందరినో జైలులో పెట్టినప్పుడు ఏనాడైనా వెళ్లి చూడటం కానీ పలకరించడం గానీ చేశారా? అని నిలదీశారు. 

నాడు రావులపాలెంలో అప్పటి ముఖ్యమంత్రి సభలో కాపులను గొడ్డును బాదినట్లుగా బాదిన బాధితులను ఏరోజైనా పలకరించారా? అని పవన్‌ను ముద్రగడ ప్రశ్నించారు. 1999 ఉద్యమ సందర్భంగా అప్పట్లో పెట్టిన కేసులు తొలగించమని అప్పటి సీఎం చంద్రబాబును అడిగారా? అని నిలదీశారు. చివరిగా.. కాకినాడ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని పవన్‌కు ముద్రగడ సూచించారు. ఒకవేళ పవన్ తోక ముడిస్తే మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకుని తనను మీపై పోటీ చేసేందుకు సవాల్ విసరాలని కోరారు. గుండెలనిండా ధైర్యం ఉందని అంటారు కాబట్టి ఏదో ఒక కోరిక తప్పకుండా తీర్చే శక్తి పౌరుషం పవన్‌కు ఉన్నాయని తాను భావిస్తానని ముద్రగడ అన్నారు.