రేవంత్‌ను కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎక్కడో కొడుతోంది..

రేవంత్‌ను కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎక్కడో కొడుతోంది..

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయా? నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకేసారి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలవడమేంటి? రాజకీయ ప్రాధాన్యత లేదంటున్నా లోగుట్టు ఉండే ఉంటుందా? ఇప్పుడు తెలంగాణలో ఈ ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవలే సీఎం రేవంత్ దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్‌), కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక), మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), మాణిక్‌రావు (జహీరాబాద్‌) సీఎంను కలిశారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్‌రావు అంటే ఎప్పటి నుంచో బీఆర్ఎస్‌లో ఉన్నారు. సునీతా లక్ష్మారెడ్డి మాత్రం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌కు వెళ్లినవారే. అయితే ఇప్పుడు ఈ నలుగురూ హఠాత్తుగా వెళ్లి సీఎంను కలవడంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నలుగురు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసిందంటున్నారు.

రేవంత్‌ను కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎక్కడో కొడుతోంది..

సీఎంను మర్యాదపూర్వకంగా కలిశామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగానే కలిశామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీపై మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నలుగురు ఎమ్మెల్యేలు ఖండించారు. అయినా సరే.. ఎక్కడో కొడుతోంది శీనా? అంటూ ప్రజానీకం చర్చించుకుంటోంది. ఇటీవలే బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌.. మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ను కూడా కలిశారు. ఆ తరువాత రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను సైతం కలిశారు. వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం నడుస్తుండగానే మెదక్ ఎమ్మెల్యేలు వెళ్లి సీఎంను కలవడం చర్చనీయాంశంగా మారింది. 

Google News