అయోధ్య ఎపిసోడ్‌తో విపక్షాలకు బీజేపీ చెక్ పెట్టేసినట్టేనా?

అయోధ్య ఎపిసోడ్‌తో విపక్షాలకు బీజేపీ చెక్ పెట్టేసినట్టేనా?

అయోధ్య రామాలయం.. హిందువుల 500 ఏళ్ల నాటి కల. తరాలు మారినా ఆ ఆశ మాత్రం చావలేదు. రామయ్య నడయాడిన నేల అయిన అయోధ్యలో ఆయనకు గుడి నిర్మాణం ఎప్పుడు జరుగుతుందా? అని కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ హిందువులంతా ఎదురు చూశారు. ఆ కల 2024 జనవరి 22న నెరవేరింది. నాడు రాముల వారి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. బాల రాముడి విగ్రహానికి అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ట జరిగింది.

కట్ చేస్తే.. ప్రధాని మోదీ, బీజేపీ వల్లనే ఇదంతా సాధ్యమైందంటూ బీభత్సమైన ప్రచారం జరిగింది. రామ జపం ఒకవైపు.. ప్రధాని మోదీ జపం మరోవైపు బీభత్సంగా జరిగిపోయాయి. ఇది ఊహించనిది ఏమీ కాదు.. ఊహించిందే. రాముల వారి ఆలయ నిర్మాణం అనగానే జనం విరాళాలిచ్చేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. అలా ఆలయ నిర్మాణం పూర్తైంది. కానీ క్రెడిట్ మొత్తం మోదీ ఖాతాలో జమ అయ్యింది. ప్రచారానికి పైసా ఖర్చు లేకుండా ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీకి కావల్సిన దానికంటే ఎక్కువ ప్రచారం జరిగిపోయింది.

ప్రతిపక్షాలు ఈ కార్యక్రమానికి గైర్హాజరవడం కూడా బీజేపీకి బాగా కలిసొచ్చింది. క్రెడిట్ మొత్తం మోదీ తన భుజస్కందాలపై వేసుకున్నారు. సుప్రీంకోర్టు అయోధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన నాటి నుంచే మోదీ భజన ప్రారంభమైంది. ఆలయ నిర్మాణంతో పీక్స్‌కి వెళ్లింది. ఇది విపక్షాలకు మామూలు దెబ్బ కాదు. ఇక దేశంలోని పార్టీలన్నీ ఏకమైనా బీజేపీని ఏమీ చేయలేవు. బీజేపీ హ్యాట్రిక్ ఖాయమైపోయినట్టేనని రాజకీయ విశ్లేషకులు, సర్వేలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.