కుటుంబ సభ్యులే ప్రత్యర్థులు.. ఏపీలో ఇంట్రస్టింగ్ రాజకీయం..

Ys Jagan Vs Sharmila

ఏపీలో రాజకీయమంతా రెండు కుటుంబాల మధ్యే నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నా కూడా ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాల నడుమ పోరు కాబట్టి ఇండియా పాక్ మ్యాచ్ మాదిరిగా ఆసక్తికరంగా మారింది. వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక అక్కడి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అన్నను గద్దె దింపడమే లక్ష్యంగా చెల్లెలు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టాక ఏపీలో నాలుగు స్తంభాలాట రెండు కుటుంబాల మధ్య ప్రారంభమైంది. అంటే నాలుగు పార్టీలకు అధినేతలు వచ్చేసి రెండు కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఎన్టీఆర్ కుటుంబం నుంచి టీడీపీకి అధినేతగా ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు, బీజేపీకి ఏపీ చీఫ్‌గా ఆయన కూతురు పురందేశ్వరి ఉన్నారు. ఇక వైఎస్ కుటుంబం నుంచి ఆయన కొడుకు జగన్, కూతురు షర్మిల ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్నారు.

వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్ వైసీపీని స్థాపించారు. అప్పట్లో కొడుకు, కూతురు కలిసే పార్టీ కోసం శ్రమించారు. ఆ తరువాత విభేదాలొచ్చాయి. ఆ తరువాత షర్మిల తెలంగాణకు వెళ్లిపోయారు. తిరిగి తన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. సొంత అన్నపైనే యుద్ధం ప్రకటించారు. నిజానికి సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా ఉండటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ తరుణంలో ఏపీలో రాబోయే ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. 

Google News