Congress: తెలంగాణలో సెకండ్ ప్లేస్ నుంచి బీజేపీ తప్పుకుని కాంగ్రెస్ ముందుకు వచ్చిందా?

Congress party in Telangana

ఇప్పుడు బీఆర్ఎస్(BRS) టార్గెట్ కాంగ్రెస్సా? ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అంతలా పుంజుకుందా? అంటే అవుననే అంటోంది బీఆర్ఎస్. ఇప్పుడు బీజేపీ(BJP)ని వదిలి బీఆర్ఎస్(BRS) నేతలు.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి తెలంగాణ(Telangana) ప్రజానీకానికి తెలిసిందే. అటు తలసాని.. ఇటు రేవంత్ మాటకు మాట.. దెబ్బకు దెబ్బ తగ్గేదేలే అంటున్నారు. మరి సీన్‌లో నుంచి బీజేపీ(BJP) ఎందుకు తప్పుకుంది? నిజానికి ఇటీవలి కాలంలో బీజేపీ నేతల స్వరాలేమీ పెద్దగా వినిపించడం లేదు.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తయారైంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వర్సెస్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని బయట టాక్ నడుస్తోంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడటం లేదని.. దీంతో నేతలు సైతం గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అయిపోయారని సమాచారం. ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకుంది. రేవంత్(Revanth Reddy) తన పాదయాత్రతో జనంలో కదలిక తెస్తున్నారు. ఇక పైగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం డిక్లరేషన్ల పేరుతో తెలంగాణ జనానికి దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ ప్రత్యర్థి ప్లేస్ నుంచి తప్పుకుని అనూహ్యంగా కాంగ్రెస్ ముందుకు వచ్చింది.