చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు… రూ.వేల కోట్ల భూమి ప్రభుత్వ ఖాతాకి
టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో కొన్ని సంస్థలకు ఎకరాలకు ఎకరాలు ధారాదత్తంగా ఇవ్వడంపై హై కోర్ట్ మండిపడింది. వాటిలో 50 వేల కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాల భూములు కూడా ఉండటం గమనార్హం. 2003లో ఐఎంజీ భారత అనే సంస్థకు ఈ భూములను ఆయన కట్టబెట్టారు. ఐఎంజీ భారత అనే కంపెనీని దాని అధినేత అహోబలరావు అలియాస్ బిల్లీరావు 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేయించారు. ఆ తరువాత వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆ భూముల కేటాయింపులను రద్దు చేసింది.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం..
దీనిపై ఐఎంజీ భారత సంస్థ కోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా ఆ భూములు ఆ 800 ఎకరాలు ప్రభుత్వానివేనని హైకోర్టు తీర్పును వెలువరించింది. అలాగే కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను సైతం సమర్థించింది. కంపెనీ ప్రారంభానికి ముందు క్రీడా మైదానాలు కడతామని.. 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ ప్రచారం చేసుకుంది. ఆపై ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కంపెనీకి కేటాయించింది.
వ్యతిరేకించిన వైఎస్సార్ ప్రభుత్వం..
అయితే ఆ సమయంలో అక్కడ ఎకరం స్థలం వచ్చేసి రూ.10 కోట్ల ధర పలికింది. దానిని కేవలం రూ.50 వేలకే చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ మేరకు 2003 ఆగస్టు 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కట్టబెట్టిన ఏడాదికే అంటే 2004లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కుప్పకూలి వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చీ రాగానే ఐఏంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని వైఎస్సార్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి స్టేటస్ కో లో ఉండిపోయింది. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్పులు జారీ చేసింది. 2006 నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో రూ.వేల కోట్ల భూమి ప్రభుత్వ ఖాతాలో పడింది.