ఏపీలో గెలుపెవరిదో తేల్చిన పయనీర్ సర్వే సంస్థ..
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది. పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. టీడీపీ-జనసేనలు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంలో బిజీగా ఉన్నాయి. ఇక వైసీపీ వచ్చేసి వచ్చే ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకోవడమే అజెండాగా అడుగులు వేస్తోంది. మరోవైపు సర్వే సంస్థలన్నీ వాటి పనిలో అవి బిజీగా ఉణ్నాయి. తాజాగా ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్’ ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయమై సర్వే చేసింది.
గత నెల ఫిబ్రవరి 15 – 29 మధ్య సర్వే నిర్వహించినట్టు పయనీర్ సంస్థ వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో అధికారమెవరిది? అసెంబ్లీ, ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఎన్ని వస్తాయి? ఓట్ల శాతం వంటి విషయాలపై సర్వే నిర్వహించింది. ఈ సంస్థ సర్వే ప్రకారం ఏపీలో ఈసారి అధికారం పక్కాగా టీడీపీ – జనసేన కూటమిదే. ఈ కూటమికి 104 స్థానాలు వస్తాయట. ఇక అధికార వైసీపీ వచ్చే ఎన్నికల్లో 49 స్థానాలకే పరిమితమవుతుందట. ఇక 22 నియోజకవర్గాల్లో మాత్రం టఫ్ ఉంటుందని సర్వే సంస్థ వెల్లడించింది.
ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే.. 25 పార్లమెంట్ స్థానాలకు గానూ టీడీపీ-జనసేన కూటమి 18 స్థానాలు.. వైసీపీ 7 స్థానాల్లో విజయం సాధిస్తుందట. ఓట్ల శాతం వచ్చేసి టీడీపీ-జనసేన కూటమికి 51.4 శాతం ఓట్లు.. వైఎస్సార్‌సీపీకి 42.6 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏపీలో పుంజుకుంటుందట. ఓటింగ్ షేర్ 3 శాతం పెరిగిందని వెల్లడించింది. ఇక బీజేపీకి 1.3 శాతం, ఇతరులకు 1.4 శాతం ఓట్లు పడతాయని పేర్కొంది. అయితే ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా చేరుతోంది కాబట్టి పరిస్థితుల్లో మార్పు అయితే వచ్చే అవకాశం ఉంది. అది ఏ రకమైన మార్పనేది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఇక ముందు వచ్చే సర్వేలకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.