KCR: ఎన్నికలొస్తే బీఆర్ఎస్‌దే గెలుపు.. ఏపీలో మళ్లీ జగనే!

ఎన్నికలొస్తే బీఆర్ఎస్‌దే గెలుపు.. ఏపీలో మళ్లీ జగనే!

అవును.. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్‌దే గెలుపని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ క్రియాశీకంగా ఉందని చెప్పుకొచ్చారు. బుధవారం నాడు ఓ ప్రముఖ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ లైవ్‌ షోలో ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాస్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇదొక్కటే కాదు.. నాలుగు గంటలపాటు ఏకథాటిగా జరిగిన లైవ్‌ షోలో ఎన్నో ప్రశ్నలకు బదులిచ్చారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా పదేళ్లపాటు ఎటువంటి భేదాలు లేకుండా రాష్ట్రాన్ని పాలించామన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన అన్ని రకాల స్కీంలు అందంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా 1.8శాతం మాత్రమేనన్నారు. అయితే.. ప్రజలు కాంగ్రెస్‌ మాయ మాటలు నమ్మి రెండు, మూడు శాతం మంది అటు ఓటేశారన్నారు.

రాసిపెట్టుకోండి!

తన పార్టీది కానీ.. తనది కానీ ఎలాంటి తప్పులేదని పదేళ్లపాటు బ్రహ్మాండంగా పనిచేశామన్నారు. అమలుకాని, అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు గెలిచామని.. ఇక చాలా మంది 1000-1200 మెజార్టీతో ఓడిపోయారని చెప్పుకొచ్చారు. ‘ఇట్‌ ఇజ్‌ నాట్‌ రౌట్‌ ఫర్‌ బీఆర్‌ఎస్‌. బీఆర్‌ఎస్‌ ఇజ్‌ వైబ్రంట్‌ పార్టీ ఇన్‌ తెలంగాణ. నత్తింగ్‌ రాంగ్‌ హాజ్‌ గాన్‌..’ ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ గెలుస్తుందని.. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని బల్లగుద్ధి మరీ చెప్పారు గులాబీ బాస్. ఓటుకు నోటు కేసులో పట్టించినందుకే సీఎం రేవంత్‌ రెడ్డి తనపై కక్ష పెంచుకున్నారని ఇదే ఇంటర్వ్యూ వేదికగా కేసీఆర్ తెలిపారు. వైఎస్‌ పథకాలను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొనసాగించామని.. ఆరోగ్యశ్రీలో మరికొన్ని వ్యాధులను చేర్చామన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అలాగే ఉంచినట్లు తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్‌తో కొడంగల్‌కు నీళ్లు ఇవ్వొచ్చు అని.. నీళ్లు కావాలా, వద్దా అన్నది రేవంత్‌ తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్‌ నాటకాలు ప్రజలకు తెలిసిపోయాయని.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. ఎంపీ ఎన్నికల్లో 8 నుంచి 12సీట్లు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

'వై నాట్ 175' లక్ష్యంగా రంగంలోకి జగన్..

మళ్లీ జగనే..!

హాట్ హాట్‌గా సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే గెలుస్తారని సమాచారం ఉందన్నారు. అయినా ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పేశారు. అసలు ఏపీలో ఎవరు గెలిచినా.. తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ విడుదలైన పదుల సంఖ్యలో సర్వేలు సైతం.. మళ్లీ జగన్‌దే అధికారం అని తేల్చేశాయి. తాజాగా రాజకీయ చాణక్యుడు కేసీఆర్ నోట కూడా అదే మాట వచ్చేసింది. ఇక వైసీపీ అయితే.. 175 కు 175 గెలిచి తీరాల్సిందేనని టార్గెట్ పెట్టుకుంది.. ఏం జరుగుతుందో చూడాలి మరి.