ఏపీలో బీజేపీది ఒంటరి పోరేనా?

ఏపీలో బీజేపీది ఒంటరి పోరేనా?

ఆంధ్రప్రదేశ్‌లో పోటీ అయితే వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేనల కూటమి మధ్యే అనడంలో సందేహం లేదు. ఇవి కాకుండా జాతీయ పార్టీలున్నా కూడా అవి నామమాత్రమే. అయితే ఇప్పటికే ఈ మూడు పార్టీలు ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా జనాల్లోకి వెళ్లడం కూడా ప్రారంభించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి ఇంకా దరఖాస్తులు స్వీకరించే పనిలోనే ఉంది. మరి బీజేపీ మాటేంటి? ఆ పార్టీ ఏం చేస్తోంది?

ఇక బీజేపీ విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకూ టీడీపీ, జనసేన కూటమిలో కలుస్తుందంటూ టాక్ నడిచింది. ఇప్పుడు ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగనుందని తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జులు, సమన్వకర్తలను సైతం నియమించారు. దీంతో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఢిల్లీకి బీజేపీ అధిష్టానం ఆహ్వానించింది. ఆయన ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. పవన్‌తో బీజేపీ అధిష్టానం పొత్తు గురించి చర్చిస్తుందంటూ టాక్ నడుస్తోంది. ఒకవైపు ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది.. మరోవైపు పవన్‌ను ఆహ్వానించింది. ఈ తరుణంలో అసలు బీజేపీ ఏం చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. 

Google News