తెలంగాణలో రెండో డిప్యూటీ సీఎం ఎవరు?

తెలంగాణలో రెండో డిప్యూటీ సీఎం ఎవరు?

తెలంగాణలో రెండో డిప్యూటీ సీఎం ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైన దగ్గర నుంచి ఎలాంటి విమర్శలకూ తావివ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన, అలాగే సీనియర్ అయిన భట్టి విక్రమార్క ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మరొకరిని కూడా డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయనున్నారు.

ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరగనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెకండ్ డిప్యూటీ సీఎం నియామకం కూడా ఉండనుందని సమాచారం. ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి దగ్గర కీలక శాఖ అయిన ఆర్థిక శాఖ ఉంది. రెండో డిప్యూటీ సీఎంకు హోంశాఖను కేటాయిస్తారని సమాచారం. మరి సెకండ్ డిప్యూటీ సీఎం ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గవర్నర్ కోటాలో కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

విద్యావేత్త అయిన కోదండరాంకు విద్యాశాఖ ఫిక్స్ అయిపోయిందట. అమీర్ అలీఖాన్‌కు సెకండ్ డిప్యూటీ సీఎం ఇవ్వాలని భావిస్తున్నారట. అయితే రేవంత్ సారధ్యంలో ఇప్పటికే ముస్లింలకు పెద్దపీట వేయడం జరిగిందని.. కాబట్టి సెకండ్ డిప్యూటీ సీఎం అవకాశాన్ని బీసీలకు కేటాయించాలని ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు పట్టుబడుతున్నారట. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి వదిలేశారట. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగిస్తుందో చూడాలి. 

Google News