అమ్మో రాజ్యసభ.. ఏమాత్రం అంతు చిక్కట్లే..

అమ్మో రాజ్యసభ.. ఏమాత్రం అంతు చిక్కట్లే..

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎప్పుడు ఎన్నికలనేవి పక్కనబెడితే.. ఎమ్మెల్యే కోటాలో ఏపీలో ముగ్గురు సభ్యులకు ఆస్కారముంది. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో రాజకీయ పార్టీలకు ఇదొక సెమీస్ మాదిరిగా రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. ఇంతకు ముందైతే ఈ మూడు వైసీపీ ఖాతాలో పడిపోతాయని బల్ల గుద్ది చెప్పి ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయే. వైసీపీ తొందరపడి నియోజకవర్గ మార్పులు, చేర్పులు చేసింది.

అదే జరగకపోయి ఉంటే మూడు రాజ్యసభ స్థానాలు పక్కాగా వైసీపీ ఖాతాలో పడి ఉండేవి. కానీ ఇప్పుడు సర్వేల పేరిట కొందరిని పక్కన పెట్టేయడం.. మరికొందరిని వేరే నియోజకవర్గాలకు మార్చడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చివరి నిముషంలో ఒక సీటుకు పోటీ చేసి గెలిచి మరీ అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చేసింది.

Advertisement

ఈసారి వైసీపీపై చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో అనర్హత వేటు పడిన వారిని పక్కనబెడితే వైసీపీకి 147 మంది ఉంటారు. టీడీపీకి అయితే 18 మందే ఉంటారు. ఈ నంబర్‌తో టీడీపీ రాజ్యసభ సీటు ఒక్కటి కూడా గెలుచుకోవడం అసాధ్యం కానీ వైసీపీ నుంచి కొందరు బయటకు వెళ్లారు. ఉన్న వారిలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. ఇదంతా చూస్తుంటే పార్టీలకు దిమ్మ తిరుగుతోంది. అసలు వైసీపీ 3 సీట్లనూ గెలుచుకుంటుందా? లేదంటే టీడీపీ ఒకటీ అర ఎగేరేసుకుపోతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.