ఎన్నికలకు సర్వం ‘సిద్ధం’.. సమరశంఖం పూరిస్తున్నజగన్

ఎన్నికలకు సర్వం ‘సిద్ధం’.. సమరశంఖం పూరిస్తున్నజగన్

‘వై నాట్ 175’కి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. ఈ టార్గెట్‌తోనే ఆయన జనాల్లోకి వెళ్లనున్నారు. కేడర్‌ను ఉత్తేజితుల్ని చేసి మళ్లీ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా వైసీపీ సమరశంఖం పూరిస్తోంది. దీనికి పక్కా ప్రణాళికను సైతం సిద్ధం చేసుంది. 175 అసెంబ్లీ.. 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే ఎజెండాగా.. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు జగన్‌ సిద్ధమయ్యారు. ఈ నెల 27న విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచే ఎన్నికల పోరును ప్రారంభించనున్నారు. దీనికి గానూ ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగుచోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభ­లు నిర్వహించాలని జగన్ నిర్ణయించారు.

ఎన్నికలకు సర్వం ‘సిద్ధం’.. సమరశంఖం పూరిస్తున్నజగన్

సంగివలసలో తొలి సభ..

ప్రణాళికలో భాగంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో తొలి సభను జగన్ నిర్వహించనున్నారు. ఈ సభకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి భారీఎత్తున తరలివెళ్లడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. ఈ సభ కోసం స్థలం కూడా సిద్ధమైంది. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖ జిల్లాలోని విశాఖపట్టణం–భువనేశ్వర్‌ జాతీయ రహదారిని ఆనుకొని తగరపువలస మూడు కోవెళ్లు ఎదురుగా ఉన్న 15 ఎకరాల విశాలమైన స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. భీమిలి బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లేందుకు ఇప్పటికే సన్నద్ధతపై ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేశారు.

ఎన్నికలకు సర్వం ‘సిద్ధం’.. సమరశంఖం పూరిస్తున్నజగన్

కేడర్‌తో ముఖాముఖి..

వాహనాలు ఏవిధంగా సమకూర్చుకునేది? అలాగే ఎవరెవరు వెళ్లాలనేదీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి తరలివస్తున్న దృష్ట్యా ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా ఏ విధంగా, ఏ సమయంలో చేరుకోవాలనేదీ నాయకులకు తెలియజేశారు. ఇక ఈ సభలో కార్యకర్తలనుద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఆ తరువాత నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్‌తో సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. పార్టీ కార్యకర్తలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికి జగన్ అయితే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసి ఎన్నికల్లోకి దిగుతున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే జగన్ ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల ప్రచార బరిలో ఎవరు ముందుంటే వారినే విజయం వరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి జగన్ ‘సిద్ధం’ అయిపోయారు.