టీడీపీ వర్సెస్ జనసేన కోల్డ్ వార్ సాగుతోందా?
ఏపీలో ఇటీవలి కాలంలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా ఇరు పార్టీల నేతల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేలా చూశారు. అయితే ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఇరు పార్టీల కేడర్ మధ్య కలహాలకు దారి తీశాయి. చంద్రబాబుతో జరిగిన భేటీలో జనసేన సీట్ల గురించి పవన్ ప్రస్తావించారని టాక్ నడుస్తోంది కానీ ఈ విషయమై అటు పవన్ కానీ ఇటు చంద్రబాబు నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. అసలు సీట్ల సర్దుబాటు ఎలా అనేది కూడా తెలియనివ్వడం లేదు.
కొద్ది రోజులుగా సీట్ల అంశమే ఇరు పార్టీల్లో కల్లోలం రేపుతోంది. తమ సీట్లు ఎక్కడ జనసేనకు పోతాయోనని టీడీపీ నేతలు.. తమకు ఎక్కడ తక్కువ వస్తాయోనని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతల మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఈ క్రమంలోనే పొత్తు సీట్లు ఇప్పుడే ప్రకటిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని చంద్రబాబు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఇక మీదట కొన్ని సభలు కలిసి నిర్వహించాలని ఇరు పార్టీల అధినేతలు భావిస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి.
పవన్ సీఎం కావాలని జనసేన క్యాడర్ బలంగా కోరుకుంటోంది కానీ దానికి కావల్సిన స్టామినా అయితే ఆ పార్టీకి ఇంకా రాలేదనే చెప్పాలి. పైగా పొత్తు ప్రకటన తర్వాత జనసేన పార్టీలో ముందున్న జోష్ అయితే లేదని తెలుస్తోంది. పైగా జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయిస్తే టీడీపీలో అసంతృప్తులు పెరుగుతారు. అలాగని జనసేనకు తక్కువ కేటాయిస్తే ఆ పార్టీలో అసంతృప్తులు పెరుగుతారు. పోనీ జనసేనను లైట్ తీసుకుందామంటే ఓట్లు చీలి వైసీపీకి ప్లస్ అవుతుంది. మొత్తానికి టీడీపీ వర్సెస్ జనసేనలో సైలెంట్ వార్ అయితే జరుగుతోందట.