ఏపీ ప్రత్యేక హోదాను ఆ అధికారే అడ్డుకున్నారట..

ఏపీ ప్రత్యేక హోదాను ఆ అధికారే అడ్డుకున్నారట..

ఏపీలో ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాటి యూపీఏ సర్కారు.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నాటి యూపీఏ సర్కారు సిద్ధమైంది కానీ ఓ అధికారి సైంధవుడిలా మారారనేది ఇప్పుడు ఏపీలో కాక రేపుతోంది. ఆ అధికారి మరెవరో కాదు.. ఐఏఎస్ ఆఫీసర్ రజిత్ భార్గవ. ఒక అధికారికి ప్రత్యేక హోదాను అడ్డుకోగలిగేంత సత్తా ఉందా? అంటే ఉందనేలాగే వార్తలు వెలువడుతున్నాయి. అసలు అప్పట్లో ఏం జరిగిందంటే.. హోదా ప్రకటించే అధికార ప్రక్రియలో కీలకమైన సమావేశాలకు ఆయన ఐదుసార్లు డుమ్మా కొట్టారట.

ఈ డుమ్మాలతో సమావేశాలు ముందుకు సాగలేదట. ఇంత జరుగుతున్నా కూడా అప్పటి నేతలెవరూ దృష్టి సారించకపోవడం దీనికి మరో కారణం. అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక హోదా ప్రతిపాదనకు ఓకే చెప్పడం.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. కేవలం ప్రణాళిక సంఘం నోటిఫికేషన్ వెలువడటమే బాకీ ఉంది. దీనికోసం కమిటీ ఏర్పాటు కూడా పూర్తైంది. అయితే ఈ కమిటీ ప్రత్యేక హోదాకు సంబంధించి సమావేశాల మీద సమావేశాలు నిర్వహించినా కూడా రజత్ భార్గవ మాత్రం ఒక్క సమావేశానికి కూడా హాజరు కాలేదట. ఈయన స్థానంలో వెళ్లిన డిప్యూటీ స్థాయి అధికారి హోదాకు అడ్డుపుల్ల వేశారట.

అయితే ఏపీ ప్రత్యేక హోదాను రజత్ భార్గవ అడ్డుకోవడానికి ప్రధాన కారణం.. కేవలం మెహర్బానీ కోసమేనంటూ వార్తలు వెలువడుతున్నాయి. అప్పట్లో అంటే రాష్ట్ర విభజన సమయంలో రజత్ భార్గవను రోస్టర్‌ పాయింట్ల ప్రకారం తెలంగాణకు కేటాయించారు. అయితే తెలంగాణలో తాను ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నానంటూ గొప్పలు చెప్పుకోవడం కోసమే ఇదంతా చేశారంటూ వస్తున్న వార్తలు ఏపీలో సెగలు పుట్టిస్తున్నాయి.

అయితే రాష్ట్ర విభజన అమల్లోకి రావడానికి ముందే ఈ హోదా అంశం కూడా తేలాల్సి ఉంది. విభజన పూర్తవడం.. వెంటనే ఎన్నికలు రావడంతో హోదా అంశం మరుగున పడిపోయింది. ఆ తరువాత వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గత ప్రభుత్వం చేసిన జీవోలు చెల్లుబాటు కాదు. దీంతో మొత్తానికే ప్రత్యేక హోదా అంశం ఖల్లాస్.

Google News