గన్నవరంలో వైసీపీకి అడ్డంకులన్నీ తీరినట్టే.. ఇక టీడీపీని ఒక ఆట ఆడుకోవడం ఫిక్స్..!
ఏపీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది గన్నవరం. వల్లభనేని వంశీని మళ్లీ గెలిపించుకుని తమ స్థానాన్ని గన్నవరంలో పదిలం చేసుకోవాలని వైసీపీ గట్టిగానే భావిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ శతవిధాలుగా యత్నిస్తోంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా బరిలోకి దిగిన యార్లగడ్డ వెంకట్రావు.. ప్రస్తుతం వంశీకే గన్నవరం అసెంబ్లీ టికెట్ ఫిక్స్ కావడంతో టీడీపీలోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు కాస్త మారే అవకాశం ఉండటంతో వైసీపీ వెంటనే అప్రమత్తమైంది.
వల్లభనేని వంశీకి 2014 ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేసిన దుట్టా రామచంద్రరావుకు కూడా పడటం లేదు. ఇటీవలి కాలంలో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికల్లో సైతం ఆయన వంశీకి అనుకూలంగా పని చేసే దాఖలాలు ఏమీ కనిపించడం లేదు. అసలు వైసీపీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అటు యార్లగడ్డ పార్టీని వీడి.. ఇటు దుట్టా కూడా కలిసి రాకుంటే ఈసారి గన్నవరంలో వైసీపీ గెలవడం చాలా కష్టమని పార్టీ అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే దుట్టాకు సన్నిహితులైన ఎంపీ వల్లభనేని బాలసౌరిని రంగంలోకి దింపింది.
బాలసౌరి దుట్టా నివాసానికి వెళ్లి ఆయనతో కాసేపు ముచ్చటించారు. కొద్దిసేపు దుట్టాతో ఏకాంతంగా మాట్లాడిన ఎంపీ, కేవలం మర్యాదపూర్వకంగా కలిసేందుకే వచ్చానన్నారు. పైకి బాలశౌరి మర్యాదపూర్వకంగా అని చెబుతున్నప్పటికీ లోగుట్టు మాత్రం అందరికీ తెలిసిందే. రాజకీయంగా తన అభిప్రాయాలు రెండు నెలల కిందట సీఎం జగన్‌కు చెప్పానని, వాటినే ఎంపీకి కూడా వివరించినట్లు దుట్టా తెలిపారు.
అయితే పార్టీ విజయానికి దుట్టా పని చేసేలా ఆయనను అయితే బాలశౌరి ఒప్పించారని తెలుస్తోంది. ఈ సందర్భంగానే ఎమ్మెల్యే వర్గీయులైన కొందరు ముఖ్య నాయకులు కూడా ఎంపీని కలిసేందుకు దుట్టా నివాసానికి రావడం గమనార్హం. మొత్తానికి గన్నవరంలో వైసీపీ విజయం దుట్టా కూడా కలిసిరావడంతో సునాయాసమేనని విశ్లేషకులు చెబుతున్నారు.