సీఎం కేసీఆర్‌పై పోటీకి రాములమ్మ సై..

సీఎం కేసీఆర్‌పై పోటీకి రాములమ్మ సై..

తెలంగాణలో బీఆర్ఎస్ మినహా ఏ పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. అయితే బీజేపీ నుంచి మాత్రం ఒక నియోజకవర్గం విషయంలో క్లారిటీ వస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్‌పై పోటీకి బీజేపీ నాయకురాలు విజయశాంతి సై అంటున్నారు.

అవకాశం తనకే ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ కు రాములమ్మ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. వాటిలో కామారెడ్డి ఒకటి. అయితే బీజేపీ అభ్యర్థిగా విజయశాంతిని కామారెడ్డి బరిలో దింపేందుకు కమలం పార్టీ కసరత్తు నిర్వహించింది.

Advertisement

కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీపై కమలం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి రాములమ్మ చేస్తున్న ట్వీట్స్ కూడా బలం చేకూరుస్తున్నాయి. కేసీఆర్‌ను రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నట్టు విజయశాంతి బాహాటంగానే చెబుతున్నారు.

మరోవైపు కేసీఆర్‌పై పోటీకి సంబంధించి రాములమ్మ పలు రకాల ట్వీట్స్‌తో ఆసక్తిని పెంచుతున్నారు. పార్టీ ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీకి సిద్ధం రెడీ అంటూ రాములమ్మ ట్వీట్స్ చేస్తు్న్నారు. అన్ని చెబుతూనే.. తిరిగి కామారెడ్డి నుంచి పోటీ విషయం పార్టీ నిర్ణయిస్తోందని విజయశాంతి చెబుతున్నారు. బీజేపీ నుంచి బరిలోకి దిగి తన సత్తా చాటాలని ఆమె ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పార్టీ ఆదేశాలను పాటించడమే బీజేపీ కార్యకర్తల విధానమని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్స్ రాములమ్మ కామెంట్స్ పెంచుతున్నాయి. గతంలో మెదక్ ఎంపీగా పని చేసిన విజయశాంతి.. ఈ సారి కూడా లోక్‌‌‌‌సభకు పోటీ చేయాలని భావించారు.

అయితే సీఎం కేసీఆర్‌పై పోటీ అనగానే ఆమె మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి బరిలో నిలవాలని రాములమ్మ నిర్ణయించుకుంటే.. బీజేపీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై రాములమ్మ పోటీ చేస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో కామారెడ్డి సీటు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనుంది.