రాజకీయాల నుంచి గల్లా జయదేవ్ తప్పుకోవాలనుకుంటున్నారా? కారణమిదేనా?

రాజకీయాల నుంచి గల్లా జయదేవ్ తప్పుకోవాలనుకుంటున్నారా? కారణమిదేనా?

గుంటూరు పార్ల‌మెంటు స‌భ్యుడు,టీడీపీ నాయ‌కుడు, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌ గ‌ల్లా జ‌య‌దేవ్ రాజకీయాలకు దూరం కాబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది. పార్లమెంటులో ఏపీ సమస్యలపై ఆయన గళమెత్తిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలకు దూరం కాబోతున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. గల్లా జయదేవ్ వర్గం సైతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారనే చెబుతోంది. అసలు దీనికి కారణాలేంటి?

జనాలు గల్లా జయదేవ్‌ను మెచ్చి ఎంపీగా గెలిపించారు. ఆయన కూడా పలుమార్లు పార్లమెంటులో గళం విప్పి ఏపీ ప్రజల మనసు గెలుచుకున్నారు. ఇప్పటికే ఆయన మాతృమూర్తి, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి రాజకీయాలకు దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె చాలా కాలం పాటు పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆమె టీడీపీలో చేరారు. ఆ తరుణంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి అరుణ కుమారి, గుంటూరు పార్లమెంటు స్తానం నుంచి జయదేవ్ 2014లో పోటీ చేశారు. అయితే అరుణ ఓటమి పాలవగా.. జయదేవ్ విజయం సాధించారు. 2019లోనూ ఎంపీగా మరోమారు గుంటూరు స్థానం నుంచి పోటీ చేసి జయదేవ్ విజయం సాధించారు. ఇప్పుడు జయదేవ్ కూడా దూరమైతే రాజకీయాల నుంచి గల్లా కుటుంబం పూర్తిగా తప్పుకున్నట్టే అవుతుంది.

రాజకీయాల నుంచి గల్లా జయదేవ్ తప్పుకోవాలనుకుంటున్నారా? కారణమిదేనా?

అసలెందుకు జయదేవ్ తప్పుకోవాలనుకుంటున్నారు?

28న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు టీడీపీ నేతలతో భేటీ కావాల‌ని గ‌ల్లా జయదేవ్ నిర్ణ‌యించుకున్నారు. ఇప్పటికే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న జయదేవ్ ఈ విషయాన్ని టీడీపీ అధిష్టానానికి తెలియజేశారు. ఈ క్ర‌మంలోనే ఆయన ఓ ప్రైవేట్ కళ్యాణ మంటపంలో టీడీపీ నేతలకు ఆత్మీయ విందు ఇవ్వ‌నున్నారు. అసలు జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకోవడానికి కారణం.. త‌న వ్యాపారాల‌కు ఇబ్బందులు తలెత్తడమే. కొంతకాలంగా అధికారులు తనకు స‌హ‌క‌రించ‌డం లేద‌ని.. కొన్నాళ్లుగా ఆయ‌న అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా తన వ్యాపారంలో కొంత భాగాన్ని సైతం తెలంగాణకు తరలించాల్సి వచ్చింది. ఇలాంటి ఇబ్బందులు ఇకమీదట తలెత్తకూడదనే కారణంతోనే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మరి టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఆయనేమైనా మనసు మార్చుకుంటారేమో చూడాలి.