జగన్‌పై నేరుగానే విమర్శలు గుప్పిస్తున్న షర్మిల
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాదు కానీ.. రాష్ట్రం విడిపోయాక జీవం కోల్పోయిన పార్టీకి జవసత్వాలు తిరిగి తీసుకొచ్చేందుకు ఆరాటపడుతోంది. దీని కోసమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలను రంగంలోకి దింపింది. ఆమె వచ్చింది మొదలు పార్టీలో అయితే కొత్త ఉత్సాహం వచ్చింది. ఆమె కూడా అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించడం కోసం ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే చాలా ప్రయత్నిస్తున్నారు.
అయితే షర్మిల తన అన్న జగన్‌ను విమర్శిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ విమర్శించినా నేరుగా విమర్శిస్తారా? లేదంటే పరోక్ష విమర్శలు చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే షర్మిల తన అన్న జగన్‌ను నేరుగానే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని.. పాలక పక్షం, బీజేపీతో ములాఖత్ అయ్యిందని షర్మిల విరుచుకుపడ్డారు. విశాఖలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె నేరుగానే జగన్‌పై విమర్శలు గుప్పించారు.
బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుందని షర్మిల విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాత్రం దానిపై పోరాటం చేసిందే లేదన్నారు. అసలు జగన్ విశాఖకు ఏం చేశారని షర్మిల ప్రశ్నించారు. రైల్వే జోన్ సంగతి అతీగతీ లేదు.. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారంటూ విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కు కార్మాగారానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వీర్యం చేశారని.. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటూ షర్మిల పిలుపునిచ్చారు.