నా తండ్రి హత్య కేసులో జగన్, అవినాశ్ రెడ్డిల హస్తముంది: సునీతారెడ్డి సంచలనం

నా తండ్రి హత్య కేసులో జగన్, అవినాశ్ రెడ్డిల హస్తముంది: సునీతారెడ్డి సంచలనం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హత్య కేసు గురించి ప్రస్తావించారు. తన తండ్రి హత్య కేసులో ఏపీ సీఎం జగన్‌తో పాటు ఎంపీ అవినాశ్ రెడ్డిల హస్తముందంటూ సంచలనానికి తెరదీశారు. జగన్‌తో పాటు ఆయన పార్టీ వైసీపీకి ఓటేయవద్దని కోరారు. తన తండ్రి హత్య కేసులో తన పోరాటానికి ప్రజల మద్దతును సునీతారెడ్డి అర్థించారు. మార్చురీ వద్ద అవినాశ్‌తో మాట్లాడానని కానీ హంతకులు మన మధ్యే ఉంటారన్న విషయం నాడు తనకు తెలియలేదన్నారు. తండ్రి హత్య జరిగిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు వెళదామని జగన్‌ను అడిగితే వద్దని వారించారని సునీత తెలిపారు. ఒకవేళ సీబీఐ దర్యాప్తునకు వెళితే ఎంపీ అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళతారని జగన్ చెప్పారన్నారు.

జగనే వాళ్లిద్దరినీ రక్షిస్తున్నారు..

అయినా సరే తాను వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేశానని.. తనను, తన భర్తను నాటి నుంచి వేధిస్తున్నారని సునీతరెడ్డి తెలిపారు. చివరకు సీబీఐ పైన కూడా కేసులు పెట్టి.. విచారణను ముందుకు సాగకుండా చూశారన్నారు. తన తండ్రి హత్య కేసులో బాబాయి భాస్కరరెడ్డితో పాటు ఆయన తనయుడు అవినాశ్ రెడ్డి ప్రమేయముందని తెలిపారు. వారిద్దరినీ జగనే రక్షిస్తున్నారని సునీతారెడ్డి ఆరోపించారు. ఇక సీబీఐ ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కుంటోందో తనకు తెలియదన్నారు. మొదటి నుంచి తనకు అండగా షర్మిలే ఒక్కరే ఉన్నారు. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటి వారంతా తనకు అండగా నిలిచారన్నారు. 700 మందికి పైగా కుటుంబ సభ్యులు ఉండటంతో తమది వసుదైక కుటుంబమని ఆనదించానని.. ఎన్ని గొడవలున్నా అందరం కలిసే ఉన్నామన్నారు కానీ తనకు కష్టమొస్తే ఎవరూ అండగా రాలేదని సునీతారెడ్డి వాపోయారు.

గొడ్డలితో చంపారని జగన్‌కెలా తెలుసు?

తన తండ్రి హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలని సునీతారెడ్డి డిమాండ్ చేశారు. అసలు తన తండ్రిని గొడ్డలితో నరికి చంపారనే విషయం జగన్‌కి ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇలాంటి క్రైంలు మున్ముందు కనిపించొద్దంటే ప్రజలంతా ముందుకు రావాలన్నారు. తనది న్యాయమైన పోరాటమని గుర్తిస్తే ఎవరూ జగన్‌కు ఓటు వేయరన్నారు. ఎవరైనా సరే.. ముందుగా సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించరని.. అందుకే జగన్ ని కలిసినప్పుడు తనకు ఆయనపై అనుమానం రాలేదన్నారు. తన తండ్రి హత్య కేసులో 8 మంది పేర్లు బయటకు వచ్చాయని.. ఇంకా బయటకు రావల్సిన పేర్లు చాలా ఉన్నాయని సునీతారెడ్డి తెలిపారు. అసలు ఎంపీ విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు. జాతీయ మీడియా సైతం తన తండ్రి మరణ వార్తను పట్టించుకోవడం లేదని సునీతా రెడ్డి దుయ్యబట్టారు. .