మనకైనా క్లారిటీ ఉందా.. ? అంటూ జనసేన నాయకత్వం పై క్యాడర్ మండిపాటు
టీడీపీ-జనసేన కూటమి విజయం సాధిస్తే చంద్రబాబే సీఎం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మాటతో జనసేన కేడర్ ఫైర్ అవుతోంది. ఇక అప్పటి నుంచి అంతర్లీనంగా పార్టీ స్థాపించి పదేళ్లు దాటుతున్నా అడుగు ముందుకు పడటం లేదని.. తమ అధినేతను చంద్రబాబు కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని.. ఎన్నాళ్లీ మోసం అని కేడర్‌లో చర్చ ప్రారంభమైంది. పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు పార్టీల చర్చల అనంతరమే కదా నిర్ణయం ఏదైనా ప్రకటించాలి కానీ ఏకపక్షంగా ఎంతకాలం చంద్రబాబు సీఎం అని ప్రకటిస్తారంటూ మండిపడుతున్నారు.
ఎన్నో అవమానాలు..
నిజానికి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పొత్తు సై అని.. ఆ వివరాలను పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా ఆయన అంతే గౌరవప్రదంగా ఉన్నారు. అలాంటప్పుడు లోకేష్ ఇలాంటి ప్రకటన చేయడమేంటని జనసైనికులు మండిపడుతున్నారు. టీడీపీతో తన అధినేత పొత్తు పెట్టుకున్నారని ఎన్నో అవమానాలను భరిస్తూ వస్తున్నామని.. చివరకు బీజేపీతో తెగదెంపులకు సైతం సిద్ధపడితే ఇంతగా అవమానించడమేంటంటూ మండిపడుతున్నారు. ప్యాకేజీ స్టార్ అని.. జనసేనను టీడీపీ దగ్గర తాకట్టు పెట్టారనే ఆరోపణలు వస్తున్నా దిగమింగుకుని భరిస్తుంటే పరిస్థితి మరీ దిగజారి పోతోందని కాబట్టి ఇప్పటికైనా మరోసారి ఆలోచించుకునే సమయం వచ్చిందని కేడర్‌లో చర్చ జరుగుతోంది.
పవన్ నిజంగానే అమ్ముడుపోయారా?
పవన్‌కు ఉన్న కేడర్, ప్రజాభిమానం చూసే కదా చంద్రబాబైనా, ప్రధాని మోదీ అయినా పక్కన కూర్చోబెట్టుకున్నది. మరి అలాంటి తమను ఉంటే ఉండండి.. పోతే పొండి తన దారి చంద్రబాబు దారి అని ఎలా చెబుతారని పవన్‌పై సైతం కేడర్ ఫైర్ అవుతోంది. ఇదంతా చూస్తుంటే పవన్ నిజంగానే అమ్ముడుపోయారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అసలు పవనే ఇలా ఉంటా? మనకు సీట్లు ఇస్తారా? మనం డిమాండ్ చేసి పొజిషన్‌లో ఉంటామా? అసలు మనపార్టీకి కూడా చంద్రబాబే సీట్లు కేటాయిస్తాడా ? అయన ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకుని కిమ్మనకుండా ఉండాలా ? అనే సందేహాలు సైతం తలెత్తుతున్నాయి. పవన్ కోసం ఇంతలా పోరాడుతుంటే ఆయన మాత్రం చంద్రబాబు పల్లకిని మోసేందుకు సిద్ధమవుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2019లో రెండు చోట్ల ఓటమి పాలు చేశాడు..
అసలు పవన్ వ్యవహారమంతా గందరగోళంగానే ఉందని.. మున్ముందు గౌరవం దక్కకుంటే మాత్రం మన దారి మనం చూసుకుందామనే భావనలో జన సైనికులు ఉన్నారు. పవన్‌తో వెళ్లి 2014లో ఒకసారి.. 2019లో ఒకసారి పరోక్షంగా దెబ్బతిన్నామని భావిస్తున్నారు. 2014లో అండగా నిలిచిన విషయాన్ని సైతం చంద్రబాబు మరిచి పవన్‌ను 2019లో రెండు చోట్ల ఓటమి పాలు చేశాడని మండిపడుతున్నారు. మరోసారి మోసపోవడాన్ని వారు సహించలేక పోతున్నారు. మోసం చేసేవాడిది కాదు.. మోసపోయేవాడిదే తప్పని ఇంత పుస్తక పరిజ్ఞానం ఉన్న పవన్‌కి తెలియదా? అని కేడర్ ఫైర్ అవుతోంది. కొందరైతే ఇప్పుడే తమ దారి తాము చూసుకుంటే ఎలా ఉంటుందన్న భావనకు వచ్చేశారు.
ఉండాలా.. పోవాలా?
నిన్న కాక మొన్న తెలంగాణలో చంద్రబాబు మోసం చేసి పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేసినా కూడా పవన్‌కు బుద్ధి రాలేదని కేడర్ చర్చంచుకుంటోంది. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన మరింత బలహీనపడే అవకాశం ఉందని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో తటస్థంగా ఉండటమా? లేదంటే వేరే పార్టీలోకి వెళ్ళిపోవడమా? అనే చర్చ అయితే కేడర్‌లో జరుగుతోంది. రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతున్నా పార్టీ అధినేత కానీ.. ఇతర ముఖ్య నేతలు కానీ మౌనం వహించడం.. జనసేన కార్యకర్తలకు, పవన్ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. ఇక చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో..