తెలంగాణ భవిష్యత్ కూడా ఇదేనా?: సిద్ధరామయ్య వీడియోపై కేటీఆర్ ఫైర్

తెలంగాణ భవిష్యత్ కూడా ఇదేనా?: సిద్ధరామయ్య వీడియోపై కేటీఆర్ ఫైర్

ఎన్నికల హామీలకు అంతూ పొంతూ ఉండదు. ఇబ్బడి ముబ్బడిగా వరాలు కురిపించేసి అధికారంలోకి వచ్చాక అవి అమలు చేయలేక చేతులెత్తేస్తూ ఉంటారు నేతలు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అదే చేస్తోంది. ఎన్నికల ముందు ఎన్నో హామీలను గుప్పించి మంచి మెజారిటీ అధికారంలోకి వచ్చింది. తీరా అవి అమలు చేయాల్సి వచ్చేసరికి అక్కడి ప్రభుత్వానికి దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక సీఎం ‘‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు’’ అని అసెంబ్లీలో మాట్లాడారంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. దీనిని రీ పోస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు.

Advertisement

తెలంగాణతో దీనిని ముడిపెడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలునెరవేర్చేందుకు డబ్బుల్లేవని సిద్ధరామయ్య అంటున్నారని.. మరి అలాంటి హామీలిచ్చే ముందు ఆలోచించరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా ఇలాగే హామీలిచ్చారు కాబట్టి తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే తన మాటలను వక్రీకరించి ఎడిట్ చేసిన వీడియోను ప్రసారం చేశారని సిద్ధరామయ్య అన్నారు.  బీజేపీ నేతలు అశ్వత్‌ నారాయణ, సి.టి.రవిలు ఎన్నికల హామీల అమలులో అసమర్థతను అంగీకరించినట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.