ఏపీలో మో‘ఢీ’మొదలెట్టారుగా..!

ఏపీలో మో‘ఢీ’మొదలెట్టారుగా..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎవరి వ్యూహాల్లో వారున్నారు. విజయం కోసం పార్టీలన్నీ విపరీతంగా శ్రమిస్తున్నాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ అంటే ఎలక్షన్ కోడ్ మొదలవడానికి ముందే అధికార వైసీపీ తమకు అనుకూలంగా ఉండే అధికారులందరినీ కావల్సిన ప్రదేశాలకు ట్రాన్స్‌ఫర్ చేసేసింది. ఇప్పుడు ఇక విపక్షాల వంతు. ఏపీలో టీడీపీ – జనసేన – బీజేపీలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీలో మోదీ మార్క్ రాజకీయం ప్రారంభమైంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అధికారులందరి బదిలీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం దాదాపు ఖాయమైపోయినట్టే. వీరే కాకుండా దాదాపు అరడజను మంది ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు వేయనున్నట్టు సమాచారం. దీనిపై మరికొన్ని గంటల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

సీఎస్‌తో పాటు డీజీపీ బదిలీ ఒకేసారి జరగడమనేది ఇప్పటి వరకూ లేదు. వీరిద్దరి బదిలీ జరిగితే మాత్రం ఇదే తొలిసారి అవుతుంది. వైసీపీకి అనుకూలంగా నడుచుకునే ఉద్యోగులందరిపై వేటు పడటం ఖాయంగానే కనిపిస్తోంది. మొత్తానికి మోదీ మార్క్ రాజకీయమైతే ఏపీలో ప్రారంభమైంది. ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న మోదీ.. ఇప్పుడు అధికారుల బదిలీతో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు. వీరిద్దరూ బదిలీపై వెళ్లిపోయారంటే వైసీపీకి కొంతవరకూ గడ్డు కాలం ప్రారంభమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మున్ముందు ఇంకా ఏం జరుగుతుందో.. జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి మోదీ సర్కార్ ఏమేం చేస్తుందో చూడాలి మరి.

Google News