వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దు.. కోర్టు కీలక ఉత్తర్వులు!

వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దు.. కోర్టు కీలక ఉత్తర్వులు!

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప జిల్లా కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రోజుకో ప్రెస్‌మీట్ పెట్టి వివేకా కుమార్తె సునీతా రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల.. టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులు ఇష్టానుసారంగా వివేకా హత్యపై మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇది వైసీపీకి పెద్ద మైనస్‌గా మారిపోయింది. మరీ ముఖ్యంగా షర్మిల, సునీత అయితే ఇద్దరూ ఇదే పనిలోనే ఉన్నారు.

ఈ క్రమంలోనే వారి నోటికి తాళం వేయాలని భావించిన వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. సురేష్ తరుఫున నాగిరెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించగా.. వివేకా హత్యపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. హత్య గురించి ఇక మీదట ఎవరూ మాట్లాడవద్దని కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాదు.. వైఎస్‌ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సురేష్ బాబు తన పిటిషన్‌లో ప్రతివాదులుగా షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్‌, పురందేశ్వరి, పవన్‌, రవీంద్రనాథ్‌రెడ్డి పేర్లను చేర్చారు. కాగా.. కోర్టు తీర్పు అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి ఒకింత ఊపిరిపీల్చుకునేలా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. నిద్ర లేచింది మొదలుకుని పడుకునే వరకూ ఎవరో ఒకరు ఈ కేసు గురించి ప్రస్తావించడం.. ఇక షర్మిల, సునీత అయితే అదేపనిగట్టుకుని మరీ వైసీపీని, వైఎస్ జగన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని దూషిస్తూ ఉండేవారు. దీంతో విసిగివేసారిపోయిన వైసీపీ.. ఇలా కోర్టును ఆశ్రయించడంతో వారందరి నోటికి తాళం పడినట్లయ్యింది.

Google News