వివేకా హంతకులు మీలోనే.. మీతోనే.. సౌభాగ్యమ్మకు వైఎస్ లక్ష్మి కౌంటర్!

వివేకా హంతకులు మీలోనే.. మీతోనే.. సౌభాగ్యమ్మకు వైఎస్ లక్ష్మి కౌంటర్!

వైఎస్ ఫ్యామిలీలో నిన్న మొన్నటి వరకూ మాటల యుద్ధం జరగగా.. ఇప్పుడు లేఖల యుద్ధం నడుస్తోంది. ఇదంతా వైఎస్ వివేకా హత్యపైనే జరుగుతుండటం పెద్ద చర్చకే దారితీసింది. 2019 ఎన్నికల్లో వివేకా హత్య వైసీపీకి ఎంత ప్లస్ అయ్యిందో ఇప్పుడు అంతకు వెయ్యిరేట్లు మైనస్ అయ్యింది. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ రాసిన బహిరంగ లేఖ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో వైఎస్ అవినాష్ రెడ్డిని వెనకేసుకుని వస్తున్నారని, అసలు హంతకులను సపోర్టు చేయడం ఏంటని ప్రశ్నిస్తూ లేఖలో ఇంకొన్ని సంచలన ప్రశ్నలే సంధించారు. దీనిపై ఇంత వరకూ జగన్ రియాక్ట్ కాలేదు కానీ అవినాష్ తల్లి వైఎస్ లక్ష్మి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తూ లేఖ రాసుకొచ్చారు.

లేఖలో ఏముంది..?

Advertisement

నాడు వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన వివేకా కుటుంబం ఎందుకు రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలోనే ఉందని లేఖలో లక్ష్మి నిలదీశారు. వైఎస్ విజయమ్మపై స్వయానా మరిది వైఎస్ వివేకా పోటీ చేశారని, కనీసం అప్పుడైనా కుటుంబం గుర్తు రాలేదా..? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు రాజకీయ స్వార్థంతో విజయమ్మపై పోటీ చేసినప్పుడు వాళ్లు ఎంత బాధపడి ఉంటారనే విషయం మరిచిపోతే ఎలా..? నిగ్గదీసి అడిగారు. నాడు జగన్ మనోవేదన ఆరోజు మీకు గుర్తుకు రాలేదా సౌభాగ్యమ్మా? మీ కుమార్తె సునీత నిజంగా న్యాయం కోసం పోరాటం చేస్తే కచ్చితంగా జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుందనీ హామీ ఇచ్చారు. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పుని తెలుసుకోండి! అని గట్టిగానే సౌభాగ్యమ్మను వైఎస్ లక్ష్మి నిలదీశారు.

ఇకనైనా తెలుసుకోండి..!

షర్మిల, సునీత ఇద్దరూ శత్రువుల చేతుల్లో పావులాగా మారారని, ఇప్పటికైనా తప్పు తెలుసుకోవాలని సూచించారు. పదే పదే అవినాష్ రెడ్డిని హంతకుడు అనడం ఎంతవరకు సమంజసం..? పోనీ కేసు విచారణ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇలా నిందలు మోపడం కరెక్టేనా..? అని ప్రశ్నించారు. హత్యకు కారకులైన వారు మీతోనే.. మీలోనే ఉన్నారని.. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా..? అని చేతి రాతతో రాసిన లేఖలో సౌభాగ్యమ్మను లక్ష్మి నిలదీశారు. ఐతే ఇంతటితో ఈ మాటల యుద్ధం, లేఖల యుద్ధం ఆగే పరిస్థితులు మాత్రం అస్సలు కనిపించట్లేదు. మున్ముందు ఇంకా ఏమేం జరుగుతుందో చూడాలి మరి.