వీధి రౌడీలా మాట్లాడడం ఏమిటి? పవన్‌ను కడిగిపారేసిన ముద్రగడ

వీధి రౌడీలా మాట్లాడడం ఏమిటి? పవన్‌ను కడిగిపారేసిన ముద్రగడ

కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు గట్టిగా క్లాస్ పీకారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. అండీ.. అండీ అంటూనే.. గుక్కతిప్పుకోనివ్వని ప్రశ్నలతో పవన్ కు చురకలు అంటించారు. ముందు మాట మార్చుకోవాలని.. తీరు మారాలని.. వీధి రౌడీలా మాట్లాడటం ఏంటని పవన్‌ను ముద్రగడ ఏకి పారేశారు. పవన్ ఇటీవలి కాలంలో వాడుతున్న పదజాలాన్ని ఎత్తి చూపిస్తూ.. ‘ఇప్పటి వరకూ మీరు ఎంతమందికి చెప్పుతో కొట్టారు? ఎన్ని తొక్కలు తీశారు? ఎన్ని గుండ్లు గీశారు? అని నిలదీశారు. తాను ఏనాడూ ఓటమి ఎరుగనని కానీ పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడంటూ ఎద్దేవా చేశారు.

తానూ ఇంతకాలంగా కాపుల ప్రయోజనాలు.. వారి రిజర్వేషన్ల కోసం మాత్రమే పని చేశాను తప్ప వేరే వారి పల్లకీకి భుజం కాయలేదని ముద్రగడ తేల్చి చెప్పారు. తాను ఇన్నేళ్ళలో ఎన్నడూ సూట్ కేసులకు అమ్ముడుపోలేదని స్పష్టం చేశారు. ఏనాడూ కుల రాజకీయాలు చేయలేదని.. కులాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోలేదని, తానూ అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ కుల అస్తిత్వం కాపాడడానికి .. వారి ప్రయోజనాలకోసమే పోరాడుతూ ఉన్నానని ముద్రగడ వెల్లడించారు. కాపు నాయకులకు సీఎం పదవి ఇవ్వాలని సైతం పట్టుబడిన వ్యక్తిని తాననే విషయాన్ని పవన్‌కు ముద్రగడ గుర్తు చేశారు. 

రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ అమ్మకం వంటి సమస్యల మీద పోరాడాల్సిన మీరు కులాన్ని అడ్డంపెట్టుకుని బతకడానికి తప్ప ప్రజాపోరాటాలకు పనికిరారంటూ పెద్ద ఎత్తున విమర్శించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో అవమానకరంగా మాట్లాడిన పవన్‌ను ఈ లేఖలోనే ముద్రగడ ఏకిపారేశారు. దశాబ్దాలుగా ద్వారంపూడి కుటుంబం ప్రజాజీవనంలో ఉందని గుర్తు చేస్తూనే.. కాపు ఉద్యమానికి నిత్యం వారితోబాటు వారి తండ్రి , తాతయ్య సైతం వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు. తాను ఎప్పుడు ఉద్యమం చేసినా అన్నివిధాలా వారి కుటుంబం సహకరిస్తూనే ఉండేదని చెప్పి ద్వారంపూడికి మద్దతుగా నిలిచారు. ఫైనల్‌గా పవన్ కల్యాణ్ అనే వ్యక్తికి మాట్లాడడం రాదని, డబ్బుకు కులాన్ని అమ్ముకునే వ్యక్తి అని ముద్రగడ దెప్పిపొడిచారు.

Mudragada Letter1
Mudragada Letter2
Google News