చంద్రబాబు ఎస్టేట్‌లో పవన్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌: ముద్రగడ

చంద్రబాబు ఎస్టేట్‌లో పవన్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌: ముద్రగడ

ఏపీ రాజకీయాలు బీభత్సమైన హీట్‌ను రాజేస్తున్నాయి. ఈసారి అన్నా చెల్లెళ్లు, మామా అల్లుళ్లు, తండ్రీ కూతుళ్లుగా విడిపోయి మరీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించి తీరుతానంటూ వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గట్టిగా చెప్పేశారు. దీనికి ఆయ కూతురే క్రాంతి భారతి కౌంటర్ ఇచ్చారు. తన మద్దతును పవన్‌కు ప్రకటించడమే కాకుండా జనసేనలో సైతం ఆమె చేరేందుకు సిద్ధమయ్యారు. ఆమెకు భవిష్యత్‌లో పవన్ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. 

నేడు దీనిపై ముద్రగడ ఒకింగ ఘాటుగా స్పందించారు. తన కూతురికి భవిష్యత్‌లో టికెట్ ఆఫర్ చేయడంపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సీటుకే దిక్కు లేదని.. తన కూతురికి సీటు ఇస్తానంటున్నాడంటూ మండిపడ్డారు. పవన్ చెప్పేదంతా సొల్లు అని.. మా బతుకు మమ్మల్ని బతకనివ్వాలంటూ పవన్‌ను ముద్రగడ అర్థించారు. కులాలు, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని మీ గురువైన టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఎస్టేట్‌లో పవన్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌‌గా ఉన్నారంటూ ముద్రగడ ఎద్దేవా చేశారు. 

భీమవరం, గాజువాకలో పవన్‌ను తన్ని తరిమేశారని.. పిఠాపురంలో కూడా పవన్‌కు అదే జరుగుతుందని ముద్రగడ అన్నారు. అంతకు ముందు కూడా ముద్రగడ పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తన కూతురును అనుకూలంగా మార్చుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. పవన్ తన ముగ్గురి భార్యలను పరిచయం చేయగలరా? అంటూ పర్సనల్ అటాక్ చేశారు. మెగా ఫ్యామిలి గురించి మాట్లాడుతూ.. ఎవరు పబ్బుల్లో తిరుగుతున్నారు? ఎవరు ఎవరితో ఉంటున్నారో బయటకు చెప్పాలంటూ నిలదీశారు.