బీఆర్ఎస్‌ను వీడిన మైనంపల్లి.. ఆందోళనలో గులాబీ నేతలు..

బీఆర్ఎస్‌ను వీడిన మైనంపల్లి.. ఆందోళనలో గులాబీ నేతలు..

తెలంగాణ సీఎం కేసీఆర్ అపర మేధావి. అలాంటి కేసీఆర్ ఎందుకోగానీ ఒక రాంగ్ స్టెప్ వేశారు. అదే ముందుగా అభ్యర్థుల జాబితా విడుదల చేయడం. అది మొదలు.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూనే ఉన్నారు. ఇంకా చాలా మంది వీడుతారని సమాచారం.

అభ్యర్థుల జాబితా కంటే ముందే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీని వీడారు. ఇక జాబితా విడుదల అనంతరం తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడారు. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 

Advertisement

ఇక జాబితా విడుదల అనంతరం టికెట్ దక్కకపోవడంతో రేఖా నాయక్ రెబల్‌గా మారారు. ఇక తాజాగా మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. మైనంపల్లి జాబితా విడుదలకు ముందు నుంచే తన కుమారుడికి టికెట్ ఇవ్వకుంటే తాను పార్టీలో ఉండబోనని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

అయినా కూడా ఆయన కుమారుడి పేరు లేకుండానే జాబితా వచ్చింది. దీంతో మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీలో ప్రతి ఒక్కరి సంగతి తేలుస్తానంటూ మైనంపల్లి హనుమంతరావు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు.

మొత్తానికి అభ్యర్థుల జాబితా వచ్చిన నాటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న మైనంపల్లి తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరుతారనే విషయమై క్లారిటీ అయితే ఇవ్వలేదు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానన్నారు.

అయితే మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమంటూ టాక్ నడుస్తోంది. ప్రజలు అందించిన సహకారానికి తాను ఎప్పటికీ మరచిపోనన్నారు. మల్కాజ్‌గిరి ప్రజలకు.. రాష్ట్రంలోని శ్రేయోభిలాషులందరినీ ప్రాణం ఉన్నంత వరకూ మరచిపోనన్నారు. దేనికి లొంగబోనని తెలియజేస్తూ మైనంపల్లి వీడియో విడుదల చేశారు.

మైనంపల్లి రాజీనామా తర్వాత బీఆర్‌ఎస్‌లో భయం పట్టుకుంది. ఇంకెంత మంది పార్టీని వీడుతారోననే ఆందోళన బీఆర్ఎస్ అగ్రనేతల్లో ప్రారంభమైంది.