హాట్ టాపిక్‌గా నారా లోకేష్.. వచ్చారనుకునే లోపే తిరిగి హస్తినకు..!

హాట్ టాపిక్‌గా నారా లోకేష్.. వచ్చారనుకునే లోపే తిరిగి హస్తినకు..!

ఏపీలో ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాట్ టాపిక్ అవతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లిన వెంటనే అంటే గత నెల 14న ఆయన ఢిల్లీ వెళ్లారు. ఒకరోజు లేదంటే రెండు రోజుల్లో ఆయన తిరిగొస్తారని అభిమానులు భావించారు. కానీ ఆయన 21 రోజులకు కానీ ఏపీ బాట పట్టలేదు. పోనీలే ఇప్పటికైనా వచ్చారని టీడీపీ శ్రేణులు నారా లోకేష్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికాయి. ఇక తమను విడిచి ఢిల్లీ వెళ్లరని అంతా భావించారు.

అయితే నారా లోకేష్ ఢిల్లీ నుంచి వచ్చినంత సేపు కూడా పట్టలేదు తిరిగి వెల్లడానికి. శుక్రవారం లోకేష్ రాజమండ్రి సెంట్రల్ జైలులో తన తండ్రి చంద్రబాబును తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణితో కలిసి వెళ్లి కలిశారు. అంతకు ముందే లోకేష్ వెంటనే తిరిగి ఢిల్లీ వెళతారన్న విషయం అభిమానులకు తెలిసింది. లోకేష్ షెడ్యూల్‌లో భాగంగా టీడీపీ ఈ విషయాన్ని తెలిపింది. ఈ నెల 9న చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి ఢిల్లీ వెళ్లాలని భావించారు.  

Advertisement

నేడు లోకేష్ హస్తినకు తిరుగు పయనమయ్యారు. ఎలాగైనా త‌న తండ్రిని మ‌చ్చలేని నాయ‌కుడిగా బ‌య‌టికి తీసుకొస్తాన‌ని లోకేశ్ స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను చుట్టుముడుతున్న కేసుల మాటేంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఏపీలో ముందుండి టీడీపీ తరుఫున జరుగుతున్న కార్యక్రమాలను జరిపించాల్సిన లోకేష్.. ఢిల్లీకి వెళ్లి కూర్చోడమేంటని ఏపీలో చర్చ జరుగుతోంది. ఏదో ఢిల్లీకి వెళ్లామా.. వచ్చామా? అన్నట్టుగా కాకుండా.. అక్కడే రోజుల తరబడి ఉండిపోతే ఏపీలో టీడీపీని ఎవరు నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు.