టీడీపీ సర్వేలన్నీ అబద్ధాలే.. ఇంకెన్ని రోజులిలా..!

టీడీపీ సర్వేలన్నీ అబద్ధాలే.. ఇంకెన్ని రోజులిలా..!

ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు.. నిన్న మొన్నటి వరకూ ఆయన కుమారుడు, యువనేత నారా లోకేష్ ఢిల్లీ వీరవిహారం చేసి వచ్చారు.. ఇక బాలయ్య అంటారా.. ఆయన ఏం చేస్తారో.. ఎందుకు మీడియా ముందుకు వస్తారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే టీడీపీ క్యాడర్ మొత్తం చెల్లా చెదరు అయిపోయింది. ఇక తెలుగు తమ్ముళ్లు అంటారా.. ఎవరు ఎటువైపు ఉన్నారో.. ఎప్పుడు గోడ దూకుతారో తెలియని పరిస్థితి. మరీ ముఖ్యంగా టీడీపీ-జనసేన కలిసి పొత్తుతోనే ముందుకెళ్తాయని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన తర్వాత.. ఎక్కడ చూసినా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సేనాని సొంత సామాజికవర్గమైన కాపులు, వీరాభిమానుల్లో చాలా వరకు రెండు, మూడు గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి. ఈసారి కూడా పవన్‌కు బుద్ధి చెబుతామని మీడియా ముందే చెబుతున్న పరిణామాలున్నాయ్. సరిగ్గా ఈ పరిస్థితుల్లో టీడీపీలో నెలకొన్న గందరగోళాన్ని సెట్ రైట్ చేయడానికి జైలు నుంచి బాబు డైరెక్షన్.. ఇక్కడ బయట ఒకరిద్దరూ ముఖ్యనేతలు తూ.చ తప్పకుండా అమలు చేసేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫేక్ సర్వేలు చేయించడం.. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో సింపతీ మరింత పెరిగిందని.. టీడీపీకి ఎక్కడలేని సీట్లు వచ్చి పడతాయనే సరికొత్త డ్రామాకు తెరలేపింది. బహుశా ఈ వార్త చదివిన తర్వాత.. ఇదేంట్రా బాబూ.. చిన్న పిల్లల స్కూల్లోలాగా పరిస్థితి ఉందని తిట్టిపోస్తున్నారు.

ఇదీ సంగతి.. ఓ లుక్కేయండహో..!

స్కూల్, కాలేజీ పిల్లల తీరు చూస్తుంటాం.. 17 మార్కులు వస్తే ఆ 1ని 7గా దిద్దేసి పేరెంట్స్‌ను మాయ చేస్తుంటారు.. 19 మార్కులు వస్తే 1ని ఏడుగా మార్చేసి.. 79 వచ్చాయని చెప్పి మోసం చేస్తుంటారు. ఇక దీంతో.. అబ్బా మా పిల్లాడు బాగానే తెగ చదివేస్తున్నాడని పేరెంట్స్ సంతోషపడిపోతుంటారు.. కానీ ఎకాడమిక్ చివరి పరీక్షల్లో వారి అసలురంగు బయటపడుతుంది. ఎప్పుడూ వచ్చే ఆ మార్కులే వస్తాయి… పరీక్ష తప్పుతాడు.. అప్పుడు నిజం తెలుసుకున్న తల్లిదండ్రులు సైతం బాధపడడం తప్ప చేసేది ఏమీ ఉండదు.! ఇన్నాళ్లూ తప్పుడు వార్తలు.. తప్పుడు కథనాలు.. అలవిమాలిన ఎలివేషన్‌లతో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అత్యంత గడ్డుపరిస్థితి ఎదుర్కొంటోంది. ఏపీ సీఎం వైఎస్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధిపథకాలు జనంలోకి చొచ్చుకుపోవడంతో టీడీపీ పునాదులు కదిలిపోయాయి. ఇటీవల వచ్చిన టైమ్స్ నౌ, ఇతర సర్వేల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని, దాదాపు 50 శాతం ఓట్లతో 24-25 లోక్ సభ సీట్లు సాధిస్తుందని వెల్లడించగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో వైసీపీ 49 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉండగా.. టీడీపీ జనసేనకలిపి 41 శాతం ఓట్లు తెచ్చుకుంటాయని ఫలితంగా వైసీపీకి ఎదురులేని మెజారిటీ సాధ్యం అవుతుందని, టీడీపీ-జనసేన కలిసినా ఫ్యాన్ ముందు కనీసం నిలిచే అవకాశం కూడా లేదని సర్వేలు చెప్పేశాయి. ఇదిలా ఉండగా సర్వేలు మొత్తం ఇలా ఉంటే క్యాడర్లో పూర్తిగా నిస్తేజం అలముకుంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే తెలుగు తమ్ముళ్లకు ఓ ఉపాయం తట్టింది.

సొంత సర్వే షురూ..!

జగన్ సర్కార్ పట్ల వస్తున్న ఆదరణ చూసి బెంబేలెత్తిన టీడీపీ క్యాడర్‌లో ఉత్తేజం నింపేందుకు ఒక కొత్త, సొంత సర్వేను తయారు చేయించి తెలుగు తమ్ముళ్లు రిలీజ్ చేశారు. అందులో భాగంగా India TV -CNX పేరిట విడుదలైన ఈ సర్వేలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి 46 శాతం ఓట్లతో 15 లోక్ సభ స్థానాలు.. తెలుగుదేశానికి 42శాతం ఓట్లతో 10 వస్తాయని ఆ సర్వే చెప్పినట్లు టీడీపీ తమ బాకా పత్రికలు, చానెళ్లలో డప్పు కొట్టుకుంటోంది. తమకు గతంలో కేవలం మూడే ఎంపీ సీట్లు తెచ్చుకుని కుదేలైన టీడీపీకి ఇప్పుడు ఏకంగా 10 సీట్లు వస్తాయని ఆ సర్వే చెబుతుండటం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత టీడీపీ గ్రాఫ్ డౌన్ అయినప్పటికీ ఇలా చెప్పుకుంటూ ఉండటం ఏంటి..? అని సొంత పార్టీ కార్యకర్తలే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి.

అభ్యర్థులకే దిక్కులేదే..!

వాస్తవానికి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి సుమారు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జిలే లేరన్న విషయం జగమెరిగిన సత్యమే. ఇక ఎంపీ టికెట్ అడిగేవారు ఎవరున్నారు.. అస్సలు ఆ పరిస్థితే లేకుండా పోయింది. ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీలే రేపొద్దున పోటీచేస్తారా లేదా అనేది నమ్మకం లేని పరిస్థితి. అలాంటిది కొత్తగా పోటీచేయడానికి వచ్చే ఎంపీ అభ్యర్థి ఎవరుంటారనేది ఆ పార్టీకే తెలియాలి.. ఆ దొంగ సర్వేలు చేసిన తెలుగు తమ్ముళ్లకే ఎరుక మరి. ఇక సీఎం జగన్ విషయానికొస్తే.. దూకుడు ముందు నిలిచే ధైర్యం లేక పోటీకి సైతం రాం.. రాం..అనేస్తున్నారు తమ్ముళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి పది ఎంపీ సీట్లు ఎలా వస్తాయి..? ఈ సర్వే మొత్తం ఓ సొంత వంటకం మాదిరి ఉందని తేలిపోయింది.. చూశారుగా క్యాడర్‌ను నిద్రలేపడానికి.. ఇప్పుడు పరిస్థితుల నుంచి డైవర్ట్ చేయడానికి ఎన్ని ఆపసోపాలు పడుతోందో టీడీపీ.

మొత్తానికి చూస్తే.. ప్రజాదరణ కోల్పోయి, ఇచ్చిన మాట, చేసిన హామీలను గాలికి వదిలేసే పార్టీగా ప్రజల్లో చీదరింపునకు గురైన టీడీపీ కార్యకర్తలు సైతం మెల్లగా త్యజిస్తున్న పరిస్థితి. దీంతో చంద్రబాబు, ఆయన చెంచాలు ఎప్పటిమాదిరిగానే సొంత మీడియాలో భారీగా ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకే క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. అంతేకాదండోయ్.. ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించే సర్వేలను సైతం తారుమారు చేసేస్తూ.. సొంత సర్వేలను ప్రకటించుకుని ప్రజలను ఏమారుస్తున్నారంటే.. టీడీపీ ఎక్కడ్నుంచి ఎక్కడికి దిగజారిపోయిందనే విషయం అర్థం చేసుకోవచ్చు. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే.. టీడీపీ కథ కంచికి చేరినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు.. కొందరు టీడీపీ నేతలే చెబుతున్నారంటే గ్రౌండ్ లెవల్‌లో సీన్ ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.