జనసేన, టీడీపీల మధ్య సీట్ల పంపకాల ఇష్యూ..!

జనసేన, టీడీపీల మధ్య సీట్ల పంపకాల ఇష్యూ..!

తెలంగాణలో లెక్కలు తేల్చేసుకున్న జనసేన.. ఏపీలో లెక్కలను మాత్రం తేల్చలేక ఆపసోపాలు పడుతోంది. బలం లేని తెలంగాణలోనే 32 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పడమే కాదు.. ఆయా స్థానాలేంటో కూడా తేల్చేశారు ఆ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ నేమూరి శంక‌ర్‌గౌడ్.

ఒక రకంగా తెలంగాణలో యమా యాక్టివ్‌గా ఉంది. మరి ఏపీ విషయానికి వస్తే..టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏమీ లేని చోటే 32 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపితే.. మరి అంతో ఇంతో బలమున్న ఏపీలో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది రాజకీయంగా చర్చకు దారి తీసింది. 

తెలంగాణతో పోల్చి చూస్తే.. ఏపీలో కనీసం 50 స్థానాల్లో అయినా జనసేన పోటీ చేయాలి. ఇంతకంటే తక్కువ స్థానాల్లో పోటీ అంటే కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణలో 32 స్థానాల విషయం తెలుసుకుని ఏపీలో టీడీపీ.. ఇక్కడ ఎన్ని స్థానాలు అడుగుతుందోనని భయపడుతోందట. కలిసి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాయి. సీట్ల పంపకాల విషయంలో మాత్రం టీడీపీ సాహసంచేయడం లేదట.

త‌మ ఆత్మ గౌర‌వాన్ని కాపాడుతేనే పొత్తు స‌క్సెస్ అవుతుంద‌ని జ‌న‌సేన శ్రేణులు ఇప్పటికే చెబుతూ వస్తున్నాయి. మరి జనసేన ఆత్మగౌరవం ఎలా నిలబడుతుందో కూడా చెప్పకనే చెబుతున్నారు.

క‌నీసం 50 సీట్లకు త‌క్కువ కాకుండా సీట్లు సాధిస్తేనే జ‌న‌సేనాని త‌న పార్టీ కార్యకర్తలు, నాయ‌కుల ఆత్మ గౌర‌వాన్ని కాపాడిన నాయ‌కుడ‌వుతారని అంటున్నారు. లేదంటే వైసీపీ ఆరోపణలే నిజమవుతాయని జనసేన శ్రేణులు అంటున్నాయి.

ఇప్పటికే పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటోంది వైసీపీ. సీట్ల విషయంలో లాలూచి పడితే ఇదే మాట నిజమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 50 స్థానాలు.. జనసేనకు అంటే టీడీపీ అంగీకరించకపోవచ్చు. టీడీపీ నేతలు సైతం దీనికి అంగీకరించరు. కేవలం 20 నుంచి 25కు అయితే టీడీపీ ఓకే. మరి దీనికి జనసేన అంగీకరిస్తుందా? జనసేన, టీడీపీ కలిసి ముందుకు వెళతాయా? లేదంటే సీట్ల పంపకాల దగ్గరే ఆగిపోతాయా చూడాలి.

Google News