తెలంగాణలో నామినేషన్ల జాతర.. బీఫామ్ అందని నేతల్లో టెన్షన్
తెలంగాణలో నేడు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. మంచి రోజు కావడంతో సెంటిమెంటును ఫాలో అయ్యే నేతలంతా ఇవాళ నామినేషన్ వేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా బీఆర్ఎస్ కీలక నేతలు.. అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ తాను పోటీ చేయనున్న గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు చేశారు. అలాగే మంత్రి కేటీఆర్ సైతం నేడు సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు.
మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇక పార్టీకి చెందిన కీలక నేతలంతా నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, బీజేపీకి చెందిన పలువురు నేతలు నామినేషన్స్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో తమ పార్టీల నుంచి బీఫామ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు రేపటిలో(నవంబర్ 10)లోగా ఫామ్ – ఏ, ఫామ్ – బీ సమర్పించాలని ఈసీ ఆదేశాలు అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.
రేపు సాయంత్రం 3 గంటల లోపు ఫామ్ ఏ, బీలను అందజేయాలని ఇప్పటికే ఆర్వోలకు సీఈవో ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కొందరు అభ్యర్థులను హోల్డ్‌లో పెట్టాయి. రేపే చివరి రోజు కావడం.. ఇప్పటికే నేతలంతా నామినేషన్లు దాఖలు చేయడం వారిని కలవరానికి గురి చేస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు ఆర్వోలకు ఫామ్ ఏ అండ్ బీ అందకపోతే వారిని ఈసీ స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించనుంది.