హాట్ టాపిక్‌గా పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్..

హాట్ టాపిక్‌గా పవన్ ఎన్నికల అఫిడవిట్..

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు ఫిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. గొల్లప్రోలు నుంచి ర్యాలీగా బయలుదేరిన పవన్ పిఠాపురానికి చేరుకుని అక్కడ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.  పవన్ ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఆ అఫిడవిట్‌లో తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను సైతం పవన్ వెల్లడించారు. 

పవన్ ఆస్తులెన్ని?

తనకు మొత్తంగా రూ.41కోట్ల 65 లక్షల విలువ చేసే బ్యాంకు నిల్వలు, బాండ్లు, వాహనాలు, బంగారం వంటివి ఉన్నాయని పవన్ తెలిపారు. రూ.2 కోట్ల విలువ చేసే 1,680 గ్రాముల బంగారం, డైమండ్లు తన వద్ద ఉన్నాయని పవన్ వెల్లడించారు. తనకు 10 కార్లు, ఒక హార్లీ డేవిడ్‌సన్ బైక్‌తో పాటు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు రూ.94 కోట్ల 41 లక్షల విలువైనవి ఉన్నాయన్నారు. తన భార్య కొణిదెల అన్నా పేరిట 215 గ్రాముల బంగారం సహా మొత్తం రూ.కోటి 22 వేల విలువైన ఆస్తులున్నట్టు తెలిపారు. తనకు నలుగురు పిల్లలని.. వారిలో అకీరా నందన్ మేజర్ అని.. మిగిలిన ముగ్గురూ మైనర్లని వారి పేరిట కూడా ఆస్తులున్నాయని పవన్ తెలిపారు. మైనర్లు అయిన కొణిదెల పోలిన, మార్క్ శంకర్ల పేరిట ఒక్కొక్కరికీ రూ. 11 కోట్ల ఖరీదైన భూములున్నట్టు వెల్లడించారు.

హాట్ టాపిక్‌గా పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్..

కొణిదెల సురేఖ నుంచి రూ.2 కోట్ల అప్పు

పవన్ కల్యాణ్ అప్పుల విషయానికి వస్తే.. రూ.65 కోట్ల 76 లక్షల రూపాయలకు పైగా అప్పులున్నట్టు అఫిడవిట్‌లో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అప్పులు ఎవరెవరి వద్ద నుంచి తీసుకున్నానన్న వివరాలను సైతం పవన్ వెల్లడించారు. పలవురు నిర్మాతలతో పాటు మైత్రి మూవీ మేకర్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ నుంచి కూడా అప్పులు తీసుకున్నానని వెల్లడించారు. వాటిలో సురేఖ నుంచి రూ.2 కోట్లు అప్పు తీసుకున్నట్టు తెలిపారు. ఇక తాను పదో తరగతి నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో 1984లో చదివానని తెలిపారు.

Google News