ల్యాండ్ టైటిలింగ్ కాదు.. ల్యాండ్ గ్రాబింగ్: పవన్

ల్యాండ్ టైటిలింగ్ కాదు.. ల్యాండ్ గ్రాబింగ్: పవన్

ఏపీలో అటు అసెంబ్లీ.. ఇటు సార్వత్రిక ఎన్నికలు ఏకకాలంలో జరుగనున్నాయి. ఎన్నికలకు పెద్దగా టైం లేదు. దీంతో పార్టీల అధినేతలంతా నిత్యం ఏదో ఒక సభ నిర్వహిస్తూ జనాల్లో ఉంటున్నారు. ఇవాళ పవన్ కల్యాణ్ బాపట్ల జిల్లా రేపల్లెలో సభ నిర్వహించారు. దశాబ్ద కాలం ఎన్ని ఓటములు ఎదురైనా నిలబడ్డామని.. మనకు డబ్బు అవసరం లేదని ఆత్మగౌరవం ఉంటే చాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ కేడర్‌కు హిత బోధ చేశారు. నేడు రేపల్లెలో ఆయన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రజలంతా వైసీపీ అరాచక ప్రభుత్వ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. కనీసం రైతులకు సాగునీటి అవసరాలను సైతం ఈ ప్రభుత్వం తీర్చలేకపోయిందంటూ దుయ్యబట్టారు.

ఆ వ్యక్తి ఎంతటి దుర్మార్గుడో అర్థమైంది..

వేలాది పాటశాలలను మూసి వేశారని.. విద్యావ్యవస్థను పూర్తిగా వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి కూటమి ప్రభుత్వం రాగానే మూసివేసిన పాఠశాలలన్నీ తెరిచి.. విద్యకు పెద్ద పీట వేస్తామన్నారు. దీనికోసం ముందుగా మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎంతటి దుర్మార్గుడో ప్రజలకు అర్థమైందని పవన్ అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి తద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అన్ని పార్టీలుఎలా కలిసాయో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాము కూడా అలాగే కలిశామని పవన్ స్పష్టం చేశారు.

ల్యాండ్ టైటిలింగ్ కాదు.. ల్యాండ్ గ్రాబింగ్: పవన్

ల్యాండ్ టైటిలింగ్ కాదు.. ల్యాండ్ గ్రాబింగ్..

పేకాట క్లబ్లుల నడుపుతారు కానీ రైతుల గురించి మాత్రం ఆలోచించరంటూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు చనిపోతే తన వంతుగా లక్ష రూపాయలు చొప్పున అందించానని.. గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వబోనని పవన్ స్పష్టం చేశారు. జగన్ తెచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ చట్టమంటూ దుయ్యబట్టారు. ఈ చట్టం కారణంగా ఒంటిమిట్టలో ఓ కుటుంబం చనిపోయిందన్నారు. చిన్న గులకరాయి తగిలితేనే డ్రామా చేశారని.. అమర్నాథ్ గౌడ్‌ను చంపినప్పుడు ఏమైందని పవన్ ప్రశ్నించారు.

మంటల్లో దహనం చేస్తే ఎలా భరించాడో పాపం..

రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై అత్యాచారం జరిగితే.. ఒకటో రెండో ఇలాంటివి జరుగుతాయని మహిళా మంత్రి మాట్లాడటం దుర్మార్గమని పవన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి మాటల వల్లే అమర్నాథ్ గౌడ్ అక్కను వైసీపీ నేతలు వేధించేందుకు కారణమయ్యాయన్నారు. అక్కను వేధించవద్దని చెప్పినందుకు ఆ పిల్లవాడిని పొలాల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి చంపారని పవన్ తెలిపారు. ఈ సంఘటన తలచుకొంటే తనకు విపరీతమైన బాధ వేసిందన్నారు. చిన్న బొబ్బ వస్తేనే మనం విలవిలలాడుతామని.. మరి పిల్లవాడిని మంటల్లో దహనం చేస్తే ఎలా భరించాడో పాపమంటూ పవన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సైతం ఘోరంగా విఫలమైందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Google News