జగన్ దెబ్బకు.. కూటమి అబ్బా…
తొలుత టీడీపీ, జనసేనలు.. సూపర్ సిక్స్ పేరిట ఓ మినీ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకొచ్చాయి. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని తాజాగా బీజేపీతో కలిసి పూర్తి స్థాయి మేనిఫెస్టోను తీసుకొచ్చాయి. ఇక దీన్ని అలాగే ఉంచుతారా? అంటే కొంత సందేహమే. ఎందుకంటే ఏపీ సీఎం జగన్ దెబ్బకు కూటమి అల్లాడుతోంది. ఈ మేనిఫెస్టోలో గుప్పించిన హామీలు జనాలకు ఆనతాయా? లేదంటే ఇంకేమైనా పెంచాలా? అనే ఆలోచనలో పడ్డాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల నుంచి, 50ఏళ్లకు పెన్షన్, మహిళలకు నెలకు నగదు.. వంటి హామీలను ఎన్నింటినో గుప్పించింది. లిస్ట్ అయితే చాంతాడంత ఉంది కానీ అది జనాల్లోకి ఎంత మేర వెళ్లిందో తెలియడం లేదు.
పైగా నిన్న మొన్నటి వరకూ ఉచితాలతో వైసీపీ జనాలను సోమరులను చేస్తోందని విమర్శించిన టీడీపీ, జనసేనలు ఇప్పుడు చేసిందేంటి? వైసీపీ ఇస్తామన్న వరాలకు మించిన వరాలను ప్రకటించింది. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవాలంటే ఈ పార్టీలకు ఇంతకు మించిన మార్గం లేదు కానీ ఇక్కడొక చిక్కు వచ్చి పడింది. ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పే బీజేపీకి ఈ మేనిఫెస్టో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకేనేమో కమలనాథులు మేనిఫెస్టో వేళ ఈ కాపీని పట్టుకునేందుకు కూడా ఇష్ట పడలేదు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఉచితాల టాపిక్‌ను బీజేపీయేతర పార్టీలు ఎత్తుకున్నాయంటే ఆ పార్టీకి చాలా ఇబ్బందికర పరిణామాలు సంభవిస్తాయి.
ఇప్పటికే బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటంటూ ఆ పార్టీని కొన్ని పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏపీలో పరిణామాలు దేశం మొత్తమ్మద బీజేపీ యేతర పార్టీలకు ఆయుధంగా మారితే ఆ పార్టీ దీనిని తిప్పి కొట్టడం అసాధ్యం. ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయిన పీయూష్ గోయల్.. ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కనీసం సూపర్ సిక్స్‌లోని ఉచితాలనైనా తీసేయమని బీజేపీ చెబుతోందట. పోనీ మేనిఫెస్టోను మార్చేయమంటుందా? టీడీపీ, జనసేనలకు సంకటంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి జగన్ దెబ్బకు కూటమిలోని మూడు పార్టీలు అల్లాడుతున్నాయి.